అభద్రతలో సగం మంది కార్మికులు

– ప్రపంచ సగటుతో పోల్చితే భారత్‌లో అధికం
– ఆధునిక సాంకేతికతపై ఆందోళనలు

న్యూఢిల్లీ : భారత్‌లో ఉద్యోగ అభద్రత వేదిస్తోంది. కృత్రిమ మేధా, ఆటోమేషన్‌ టెక్నాలజీలు ఈ ఆందోళనను మరింత పెంచుతున్నాయని ఓ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. భారత్‌లో దాదాపు 47శాతం మంది కార్మికులు తమ స్థానాల్లో సురక్షితంగా లేమనే భావనలో ఉన్నారు. ప్రపంచ సగటు 38శాతంతో పోల్చితే ఇక్కడ అభద్రత భావం ఎక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలను స్పష్టం చేస్తోంది. భారత యువతలో ఉద్యోగ అభద్రత భావాలు ఎక్కువగా ఉన్నాయని ‘ఏడీపీ రీసెర్చ్‌ ఇన్స్‌ట్యూట్‌ పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2023 : గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ అభిప్రాయ రిపోర్ట్‌’లో వెల్లడయ్యింది. 32,000 మంది కార్మికులపై ఎడిపి రీసెర్చ్‌ ఇన్స్‌ట్యూట్‌ సర్వే చేసింది. ‘ఈ అస్థిర, అనిశ్చిత ఆర్థిక సమయాల్లో కార్మికులు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బడా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు, ఉపాధికి ముప్పు నివేదికలతో మరింత భయపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగ అభద్రత భావాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఏడీపీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ గోయల్‌ అన్నారు. ఏడీపీ సర్వే ప్రకారం 18-24 ఏళ్ల వారు సగం మంది తమ ఉద్యోగాల్లో తమకు భద్రత లేదని చెప్పారు. ఇది 55 ఏండ్లు పైబడిన వారి నిష్పత్తికి రెట్టింపు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యధికంగా 56 శాతం మంది ఉద్యోగ అభద్రతలో ఉన్నారు. మీడియా, ఇన్ఫర్మేషన్‌ 54 శాతం, ఆథిత్య రంగంలో 51 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని ఉద్యోగులు, నిర్మాణ పరిశ్రమ, సంబంధిత ఉపాధి వర్గాలు అత్యధిక స్థాయిలో ఉద్యోగ అభద్రతను కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో మీడియా, సమాచార పరిశ్రమలోని కార్మికులు ఉద్యోగ భద్రత భయాలను వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు యువ కార్మికుల్లో ఒకరు (20%) గత 12 నెలల్లో పరిశ్రమలను మార్చాలని, పావువంతు (25%) మంది తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. 55 ఏళ్లు పైబడిన ఆరుగురిలో ఒకరు (17%) ముందస్తు పదవీ విరమణ గురించి ఆలోచిస్తున్నారు. ‘యజమానులు తమ కార్మికులకు భరోసా ఇవ్వకపోతే, వారు క్లిష్టమైన నైపుణ్యాలు, అనుభవం, ఉత్సాహాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో వారు వినియోగదారులు, క్లయింట్లకు ఆశించిన స్థాయిలో సేవలు అందించడం కష్టతరం అవుతుంది’ అని గోయల్‌ పేర్కొన్నారు.