– సెన్సెక్స్ 167 పాయింట్ల పతనం
ముంబయి : వరుస నష్టాల నుంచి ఉపశమనం లభించిందని భావించిన ఇన్వెస్టర్ల ఆనందం ఒక్క పూటలోనే ఆవిరయ్యింది. ఆరు సెషన్లలో భారీ నష్టాలను చవి చూసిన మార్కెట్లు.. మంగళవారం రాణించగా.. బుధవారం తిరిగి ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలకు తోడు ఆర్బీఐ కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. మార్కెట్లు ఉదయం లాభాల్లోనే సాగినప్పటికీ.. చివరి గంటలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు కోల్పోయి 81,467కు పరిమితమయ్యింది. ఇంట్రాడేలో 82,319 గరిష్టాన్ని తాకిన సూచీ.. మరో దశలో 250 పాయింట్లు పైగా నష్టపోయింది. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 24,981 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో ఐటీసీ, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌అండ్‌టీ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉండగా.. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. రిలయన్స్ ఇండిస్టీస్ 1.65 శాతం నష్టపోయింది. నిఫ్టీ 50లో 31 స్టాక్స్ రాణించాయి. బాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు నష్టాలను చవి చూశాయి. రియాల్టీ 2.15 శాతం, ఫార్మా 2.04 శాతం, ఆటోమొబైల్ 0.82 శాతం చొప్పున రాణించాయి.