– వేతనాలపెంపు, ఉద్యోగ భద్రత కోసం పోరాడండి :
– తెలంగాణ మీసేవా ఎంప్లాయీస్ యూనియన్ సదస్సులో జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 100 మీసేవా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈఎస్‌డీ అధికారులు వేధింపులు సరిగాదనీ, వాటిని వెంటనే ఆపాలని తెలంగాణ మీసేవా ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆ యూనియన్ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ..మీసేవా ఉద్యోగులకు మూడేండ్ల నుంచి వేతనాలు పెంచకుండా శ్రమదోపిడీకి గురిచేస్తున్నారన్నారు. 20 ఏండ్లకుపైగా సర్వీసులో ఉన్నప్పటికీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని చెప్పారు. మీసేవా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సదస్సులో జెనీమా, సురేశ్, లక్ష్మి, కవిత, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.