– కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలి
– గుడిసెల పోరాట నాయకుడు నరసింహులు అరెస్టును ఖండిస్తున్నాం : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో సర్వేనెంబర్ 615లోని ప్రభుత్వ భూమిని పెత్తందారులు ఆక్రమించుకుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదనీ, పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు తగలబెట్టి మరీ వేధిస్తున్నారనీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గుడిసెల పోరాటానికి నాయకత్వం వహించిన వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నరసింహులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండించారు. గుడిసెలు తగలబెట్టిన పోలీసులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 615లో 83 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే రియల్టర్లు ఎనిమిదెకరాలను, గ్రామ పెత్తందారి పటేల్ రామకృష్ణారెడ్డి ఐదెకరాలను, వార్డు మెంబర్ మూడెకరాలను ఆక్రమించారని తెలిపారు.
ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కోసం నాలుగెకరాలు ఆక్రమించి షెడ్ల నిర్మాణం చేశారని పేర్కొన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డ వారివైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడలేదని తెలిపారు. కొంత భూమిలో నిలువ నీడలేని పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం అక్రమ కేసులు బనాయించారనీ, పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి వేధించారని పేర్కొన్నారు. గుడిసెలు వేసుకోవడానికి తెచ్చుకున్న సామాగ్రిపైనా, గుడిసెలపైనా పోలీసులు పెట్రోల్ పోసి తగులబెట్టడం దారుణమని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆస్తి నష్టం కేసు నమోదుచేయాలనీ, పేదలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దళిత, గిరిజనులపై దాడులు ఆరికట్టాలి :ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు డీబీఎఫ్ వినతి దళిత,గిరిజనులపై జరుగుతున్న దాడులను ఆరికట్టాలని దళిత బహుజన ఫ్రంట్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్యకు ఆదివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పీ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులో రెవెన్యూ, పోలీసుల విభాగాలు తీవ్ర నిర్లక్ష్యం, వివక్ష పాటిస్తున్నాయన్నారు. రాష్ట్ర స్ధాయిలో ప్రజాసంఘాలతో కూడిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు దాసరి ఎగొండ స్వామి, పులి కల్పన, చుంచు రాజేందర్ పాల్గొన్నారు.