ఉద్యోగాలిప్పిస్తానని కుచ్చు టోపీ

– కోట్ల రూపాయలతో ఉడాయించిన మహిళ
– ఖమ్మం జిల్లా వైరాలో ఘటన
నవతెలంగాణ-వైరా
వైరా, కొణిజర్ల, బోనకల్‌ మండలాల్లో నిరుద్యోగులకు వలవేసి గురుకుల పాఠశాలలో అటెండర్‌ పోస్టులు ఇప్పిస్తానని, ముందుగా మా బాస్‌కు లక్షన్నర రూపాయలు, ఉద్యోగం రాగానే మరో లక్షన్నర ఇవ్వాలని మొత్తం రూ.3 లక్షలకు డీల్‌ కుదుర్చుకుని 70 మంది నుంచి లక్షన్నర చొప్పున కోటి రూపాయలు వసూలు చేసుకుని ఉదాయించిన ఉదంతం ఇది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలోని మహాత్మా జ్యోతి బా పూలే బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో అవుట్‌ సోర్సింగ్‌ అటెండర్‌ ఉద్యోగం చేస్తున్న బాజీ జ్యోతి పేద, మధ్యతరగతి కుటుంబాల నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి నిలువునా ముంచింది. అడ్వాన్స్‌ చెల్లించిన 15 రోజుల్లో పోస్టింగ్‌ ఆర్డర్‌ వస్తుందని, మొదటి మూడేండ్లు రూ.25 వేలు జీతం వస్తుందని, తర్వాత రెగ్యులర్‌ అయి నెలకు రూ.40 వేలు వస్తాయని నమ్మ బలికింది. ముందుగా ఇచ్చే లక్షన్నరకు నమ్మకం ఏమిటని అడిగితే అవసరమైతే ప్రాంసరీ నోటు తానే రాసిస్తానని ఆ మేరకు ప్రాంసరీ నోట్లు రాసిందని బాధితులు తెలిపారు. తాను పని చేస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌కు కూడా ఏ సమాచారం ఇవ్వకుండా మే 9వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వైరా మండలం వైరా, సిరిపురం(కెజి), ముసలి మడుగు, గౌండ్ల పాలెం, రెబ్బవరం, కొణిజర్ల మండలం చిన్న మునగాల, పెద్ద మునగాల, బోనకల్‌ మండలం బ్రాహ్మణ పల్లి, కలకోట తదితర గ్రామాల నిరుద్యోగులు ఈ మహిళ వలలో చిక్కి నష్టపోయారు. ఆమె ఈ డబ్బుతోనే ఖరీదైన కారు కొన్నట్టు సమాచారం. బాధితులకు అడ్రెస్‌ తెలియకుండా కిరాయి ఇల్లు మార్చింది. చివరిలో తల్లాడ రోడ్డులో సాకేత్‌ కృష్ణ ఆస్పత్రి వెనక పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇల్లు అద్దెకు తీసుకుని వెంటనే తాళం వేసి జంప్‌ అయింది. బాధితులు ఆమె అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లి సమాచారం కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను అడిగినా తనకే చెప్పకుండా పోయిందన్న సమాధానం లభించినట్టు బాధితులు వాపోతున్నారు. 45 రోజులుగా ఆమె ఫోన్‌ కూడా పని చేయటం లేదని తెలిపారు. బాధితులు పోలీసులను ఆశ్రయించనున్నట్టు తెలుస్తుంది.