– సమస్యలను పరిష్కరించడం లేదు
– సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు
– రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు : టీవీవీపీ ఎంప్లాయీస్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ జేఏసీ (టీవీవీపీ జేఏసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ ముఖ్య సలహాదారు డాక్టర్ టి.వినరు కుమార్, చైర్మెన్ డాక్టర్ ఎం.కె.రవూఫ్, కన్వీనర్ ఎన్.సోమమల్లయ్య, కో చైర్మెన్ సత్యనారాయణరెడ్డి (ఏఐటీయూసీ), బైరపాక శ్రీనివాస్ (సీఐటీయూ) తదితరులు వైద్యారోగ్యశాఖ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి లేఖను అందజేశారు. తమ వద్ద ప్రత్యామ్నామేది లేదనీ, డిమాండ్ల పరిష్కారం కోసం తక్షణం పోరాటమార్గాన్ని ఎంచుకుంటున్నామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీవీవీపీ ఆస్పత్రుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తామనీ, అదే విధంగా అక్టోబర్ 10న హైదరాబాద్‌లోని టీవీవీపీ కమీషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. వైద్య విధాన పరిషత్‌ను వెంటనే రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌గా మార్చాలనీ, ఉద్యోగులకు 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన టీవీవీపీ వైద్యశాలల్లోని ప్రమోషన్ పోస్టులను యధావిధిగా ఉంచి ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. అవసరమున్న పోస్టులను క్రియేట్ చేస్తూ స్టాప్ రిస్ట్రక్చర్ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలి. టీవీవీపీ ఉద్యోగులు డీఎంఈలో అబ్సార్బ్ కావడానికి ఆప్షన్ ఇవ్వాలి. 317 జీవో అమలు చేసి వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలి. ప్రతి జిల్లాకు ఒక డీసీహెచ్‌ఎస్ పోస్టు చొప్పున 33 జిల్లాలకు క్రియేట్ చెయ్యాలి. వైద్య విధాన పరిషత్‌లో ప్రమోషన్స్ లేని కేటగిరి ఉద్యోగులకు పదోన్నతి వసతిని కల్పించాలి.10. వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన జీతాలివ్వాలి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని ….వారు డిమాండ్ చేశారు.