జాతీయ జెండా తయారీకి ఇంటినమ్ముకున్నడు…

– అతుకులు, కుట్లు లేని తివర్ణ పతాకాన్ని రూపొందించిన ఏపీకి చెందిన రుద్రాక్షాల సత్యనారాయణ
– అభినందించిన రాష్ట్రపతి ముర్ము
– ఎర్రకోటపై ఎగిరేలా చూస్తానని హామీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”జాతీయ జెండా అంటేనే అందరికీ ఎనలేని గౌరవం. మువ్వన్నెల జెండాను చూస్తేనే ఒళ్ళంతా పులకరిస్తుంది. అలాంటి ప్రపంచంలోనే తొలి అతుకులు, కుట్లు లేని అశోకచక్రంతో సహా చేనేత జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రుద్రాక్షల సత్యనారాయణ తయారు చేశారు”. ఈ జెండా కోసం ఏకంగా తన ఇంటిని సైతం అమ్ముకున్నట్లు సత్య నారాయణ తెలిపారు. సోమవారం నాడిక్కడ రిటైర్డ్‌ ఐఎఎస్‌ రామచంద్రు తెజావత్‌, సినీ నటి పూనం కౌర్‌తో కలిసి సత్య నారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ప్రతిభ, అంకుటిత దీక్షను ముర్ము అభినందించారు. అనంతరం ఏపీ, తెలంగాణ భవన్‌లో సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య స్పూర్తితో ఈ అతుకులు లేని 8ఞ12 సైజ్‌లో జెండాను తయారు చేసినట్లు చెప్పారు. అలాగే ఎర్రకోటపై ఈ జెండా ఎగరాలనేది తన కల అని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని… ఎర్రకోటపై ఎగిరే జెండా నిబంధనలు, సైజులను పాటించానన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ముర్ముకు వివరించగా ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎర్రకోటపై ఈ జెండాను ఎగురవేసే అంశంతో పాటూ, ఆర్థికంగా ఆదుకునే విషయంలో అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. కాగా, ఈ జెండా తయారీ కోసం గడిచిన నాలుగేండ్లలో రూ.6.50 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పూర్తిస్థాయి జెండా ప్రయత్నంలో 24 జెండాలు పాడయ్యాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎగరువేసే 4ఞ6 సైజ్‌ జెండాలు రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎర్రకోటపై ఎగరేస్తున్న జెండా కర్ణాటకలో తయారవుతోందని రామచంద్రు తెజావత్‌ తెలిపారు. ఆ జెండాకు ఐఎస్‌ఐ ముద్ర, ఇతర నిబంధనలు ఉంటాయన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన హామీతో త్వరలో తెలుగు ప్రాంతానికి చెందిన సత్యానారాయణ తయారు చేసిన ఏకవస్త్ర జెండా ఎర్రకోటపై రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశం గర్వించే జెండా: పూనం కౌర్‌
ఇంటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఏకవస్త్ర జాతీయ జెండాను సత్యనారాయణ రూపకల్పన చేయడం గర్వకారణమని నటి, ఏపీ చేనేత అంబాసిడర్‌ పూనం కౌర్‌ అన్నారు. ఈ జెండా దేశం గర్వించే జెండా అని అభిప్రాయపడ్డారు. ఏకవస్త్రంతో రాత్రింభవళ్లు శ్రమించి సత్యనారాయణ ఈ జెండాను రూపొందించినట్లు చెప్పారు. ఈ జెండా తయారీకి అయ్యే ఖర్చులను తానే భరిస్తానని చెబితే సత్య నారాయణ నిరాకరించారన్నారు. చేనేత మగ్గంపై దేశభక్తిని, జాతీయ స్పూర్తిని చాటిన సత్య నారాయణను అందరూ అభినందించాలి, ప్రోత్సహించాలి అని తెలిపారు. చేనేతపై ఉన్న మక్కువతో దేశంలో అనేక ప్రాంతాలను సందర్శించానని, చేనేత రంగం అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నానని చెప్పారు.