ప్రజల గొడవే ఆయనది

He is the quarrel of the people– తెలంగాణ ప్రజల ఆరాధ్యుడు కాళోజీ
– నేడు తెలంగాణ భాషా దినోత్సవం
– పనులు పూర్తికాక కళాక్షేత్రం ప్రారంభం వాయిదా
కాళోజీ పురస్కార గ్రహీతలు
2015 అమ్మంగి వేణుగోపాల్‌
2016 గోరటి వెంకన్న
2017 రావులపాటి సీతారాం
2018 అంపశయ్య నవీన్‌
2019 కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి
2020 రమా చంద్రమౌళి
2021 పెన్నా శివరామకృష్ణ
2022 రామోజు హరగోపాల్‌
2023 జయరాజ్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అన్న కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజలందరికీ ఆరాధ్యుడు. స్వాతంత్య్ర సమరమైనా, రజాకార్ల అరాచకాలనైనా, హక్కుల ఉద్యమాలైనా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమమైనా కాళోజీది కీలకపాత్ర. అన్యాయాన్ని నిర్మొహమాటంగా, నిర్భయంగా, నిక్కచ్చిగా నిలదీసిన ధైర్యశీలి కాళోజీ. భాషల్లో రెండు రకాలుంటాయని, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష, పలుకు బడుల భాష గావాలెనని కాళోజీ స్పష్టం చేశారు. అందుకే ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ప్రజల గొడవను తన గొడవగా ‘నా గొడవ’ పేరుతో అద్భుతమైన రచనలు చేశారు. కాళోజీ జయంతిని శనివారం (సెప్టెంబర్‌ 9) తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా హన్మకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ఘనంగా ప్రారంభించి కాళోజీకి నివాళులర్పించాలని భావించినా పనులు పూర్తి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా రట్టిహల్లిలో సెప్టెంబర్‌ 9, 2014లో కాళోజీ రంగారావు- రామబాయమ్మకు జన్మించిన కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరాంరాజ కాళోజీ. ఆయన సోదరుడు కాళోజీ రామేశ్వర్‌రావు ఉర్ధూ కవి. కర్నాటకలో జన్మించిన కాళోజీ కాజీపేట మండలం మడికొండలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. మడికొండలోనే ప్రాథమిక విద్యనభ్యసించారు. హన్మకొండ, హైదరాబాద్‌లోని చౌమహల్‌లో కాలేజీ విద్యనభ్యసించారు. హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 1939లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆర్యసమాజ్‌, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రజాకార్ల అరాచకాలపై గళమెత్తినందుకు కాళోజీని నిజాం రాజు వరంగల్‌ నగర బహిష్కరణ చేశారు. స్వరాజ్య సమరం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను బహిష్కరిస్తే వారిని నాగ్‌పూర్‌ యూనివర్సిటీలో చేర్పించి ఆదుకున్నారు.
అనునిత్యం ప్రశ్నించే గొంతుక కాళోజీ
కాళోజీ తెలుగు, హిందీ, ఉర్ధూ, మరాఠీలో కవిత్వం రాశారు. 1995లో ఆయన ‘ఇది నా గొడవ’ ప్రచురించారు. భూస్వాములను, రజాకార్లను, పాలకులను ఎవరిని వదలకుండా ప్రజల పక్షాన నిలిచిన మహామనిషి కాళోజీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని సత్యాగ్రహ ఉద్యమ సందర్భంలో 25 ఏండ్ల వయస్సులోనే జైలుకు వెళ్లారు. ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్‌, ఆంధ్ర మహాసభ, తెలంగాణ రచయితల సంఘాలకు నాయకత్వం వహించారు. మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి.నర్సింహారావుతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1958 నుంచి 1960 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు.
పద్మవిభూషణ్‌ కాళోజీ
కాళోజీ కవిత్వానికి 1972లోనే తామ్రపత్ర పురస్కారం లభించింది. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం కాళోజీకి గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చి సత్కరించింది. 1992లో భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను బహూకరించింది.
కాళోజీ రచనలు
1. అణా కథలు, 2. భారత దేశయాత్ర, 3. పార్థివ వ్యయము, 4. కాళోజీ కథలు, 5. నా గొడవ, 6. జీవన గీత, 7. తుది విజయం మనది, 8. తెలంగాణ ఉద్యమ, 9. ఇదీ నా గొడవ, 10. బాపూ!బాపూ!! బాపూ!!!
నేడు కాళోజీ జయంతి
కాళోజీ నారాయణరావు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.ఉదయం కాళోజీ జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం హన్మ కొండ హరిత హోటల్‌లో కాళోజీ జయంతోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సభలోనే 2023 సంవత్సరానికి కాళోజీ పురస్కారానికి ఎంపికైన కవి జయరాజ్‌కు అందించను న్నారు.
మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జయరాజ్‌ వివక్ష లేని సమసమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. మనిషికి, ప్రకృతికి మధ్య వున్న అవినాభావ సంబంధాన్ని విశ్లేషించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళోజీ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి తెలంగాణ భాషా దినోత్సవం అధికారికంగా జరుపుకోవడడమేగాక ప్రతియేటా సాహిత్యరంగంలో సేవలందిస్తున్న వారికి కాళోజీ పురస్కారంతోపాటు రూ.10,01,116 బహుకరి స్తారు. ఇప్పటి వరకు 8 మంది కవులు, రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జయరాజ్‌ తొమ్మిదో గ్రహీత.