అధిగమిస్తేనే ఆరోగ్యం…

అధిగమిస్తేనే ఆరోగ్యం...మారుతున్న కాలంతో పాటు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూనే తల్లిగా, భార్యగా అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగ నిర్వహణలోని ఒత్తిడులతో పాటు కుటుంబ బాధ్యతలను అదనంగా మోస్తున్నారు. ఇన్ని బాధ్యతల నడుమ కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడుల ప్రభావం మానసికంగానే కాక, పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిని పూర్తిగా పరిష్కరించుకో వడం కష్టమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పరిస్థితులను కొంతమేర అధిగ మించవచ్చని, ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఒత్తిడి అనేది ముప్పుకు ప్రతిస్పందన. ఇది నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ పోటీ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకోవడానికి తేలికపాటి ఒత్తిడి కొంత ఏర్పడుతుంది. తేలికపాటి ఒత్తిడి ప్రేరణకు కారకం. కానీ తీవ్రమైన ఒత్తిడి హానికరమైనది. శారీరక సమస్యలకు గానీ, మానసికంగా గానీ లేదా రెండింటికీ దారి తీసే అవకాశం ఉంది. ఒత్తిడి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎవ్వరూ తప్పించుకోలేనిది. అందువల్ల దానిని ఎదిరించి నిలబడాలి.
ఒత్తిడి రకాలు
ఒత్తిడి రెండు రకాలుగా ఉంటుంది.
తీవ్ర ఒత్తిడి : సమస్య ఏర్పడినపుడు తీవ్ర మనస్తాపానికి గురవ్వడం వల్ల ఏర్పడుతుంది. ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా ఏదైనా సమస్య ఏర్పడినపుడు శరీరం తట్టుకు నేందుకు సిద్ధంగా ఉంటుంది. అయిన కొన్ని సందర్భాల్లో మాత్రం తట్టుకోలేని సమస్య ఎదురైనపుడు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
దీర్ఘకాలిక ఒత్తిడి : ఎప్పుడు ఏదోక విషయం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇది భావోద్వేగాల ఒత్తిడి అధికమవ్వడం వల్ల వస్తుంది. దీని వల్ల రోగ నిరోదక వ్యవస్థ బలహీనపడుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మహిళలపై ప్రభావం..
కొంత కాలం కిందటి వరకు ఆవేశం, ఒత్తిడి, గుండె నొప్పి వంటివి మగవారికే ఎక్కువగా వస్తుండేవి. ప్రస్తుతం ఇవి ఆడవారికీ వస్తున్నాయి. ఒత్తిడి ఆడ, మగ ఇద్దరికీ ఉంటుంది. కానీ అది ఆడవారి మీద శారీరకంగా, మానసికంగా వారి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. పురుషులతో సమానంగా స్త్రీలకూ నేడు పని ప్రదేశాల్లో ఒత్తిడి, ఆందోళన వల్ల అనారోగ్య సమస్యలు సర్వసాధారణమయ్యాయి. మహిళలకుండే శారీరక నిర్మాణం, కుటుంబంలోని బాధ్యతల వల్ల పురుషులకంటే కొంత ఎక్కువగానే సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు శరీరంలో జరిగే కొన్ని మార్పుల పైనా ప్రభావం పడుతుంది. ఫలితంగా ఎక్కువగా అనారోగ్యాల పాలవుతున్నారు. భావోద్వేగ ఒత్తిడి సమస్య అధికంగా మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా ఉంటుందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు. పెండ్లైన మహిళలు పెండ్లి కాని వారి కంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహిళలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, ఒంటరితనం, అభద్రత వంటి వాటి వల్ల మైగ్రేన్‌, తలనొప్పి, కడుపులో పుండ్లు, గుండె నొప్పి, హైపర్‌ టెన్షన్‌, మానసికంగా కుంగిపోవడం వంటి సమస్యలకు ఎక్కువగా దారితీస్తుంటాయి. కొందరు ఆత్మహత్యల వరకు వెళ్తుంటారు. వీటన్నింటినీ మహిళలు ఎదుర్కోవాలంటే కొంత అప్రమత్తతలో వ్యవహరించాలి.
హార్మోన్లపై ప్రభావం
ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్లు ప్రభావితమవుతాయి. దీని ప్రభావం వల్ల శరీరంలోని ప్రతి భాగం అనేక సమస్యలకు లోనవుతుంది. కోపం, బాధ లాంటి నెగటివ్‌ ఎమోషన్స్‌ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి. శారీరకంగా కూడా దీని ప్రభావం ఉంటుంది. ఫలితంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు.
అధిక బరువుకు అవకాశం
ఒత్తిడిని అధిగమించేందుకు మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఎక్కువగా చేసేది అతిగా తినడం. దీని వల్ల శరీర బరువు పెరగడంతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
దీర్ఘకాల వ్యాధుల ముప్పు
ఒత్తిడి అసిడిటీ, అల్సర్ల లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది. శ్వాసలోనూ తేడాలు ఏర్పడతాయి. ఊపిరితిత్తుల కాన్సర్‌ బారిన పడే ప్రమాదముంది. జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తాయి. ఎముకలు బలహీనమవుతాయి. చిన్న చిన్న విషయాలను సైతం మరిచిపోతుంటారు. ఈ బలహీనతలు వల్ల సంతానలేమి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భాగస్వామితో పంచుకుంటే..
ఒత్తిడి, హార్మోన్లు, రోగనిరోధకశక్తి… ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఒత్తిడి ప్రభావం రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుంది. మహిళల్లో తరచుగా నిరాశ లేదా కోపం వస్తుంటే గుండె పోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో తమ సమస్యలను పంచుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చు. అలా చేయకపోతే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది. సమస్యలను ఎదిరించిగలిగే వారిలో మాత్రం ఈ ప్రమాదం తప్పే అవకాశం ఉంది.
సమస్యను అధిగమించేందుకు..
– ఎవరికి వారే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, మనసును తీవ్ర ఆలోచనల నుంచి మరల్చాలి.
– గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకుని ఆలోచనలను అక్కడే ఆపేయకుండా సంతోషాన్ని కలిగించే అంశాలు, పొందిన విజయాల వంటివి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి.
– సాధ్యమైనంత వరకు వారంలో కనీసం మూడు రోజులు శారీరక వ్యాయామానికి సమయం కేటాయించాలి. ఇష్టమైన ఆటలు ఆడాలి. మెడిటేషన్‌, శ్వాస సంబంధిత రిలాక్సేషన్‌ థెరపీలు చేస్తుండాలి. ఏరోబిక్‌ చేస్తే మంచి శరీర వ్యాయామంతో పాటు మెదడును స్థిరంగా ఉంచుతుంది. పాజిటివ్‌నెస్‌ను పెంచుతుంది.
– మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలకు వెళ్ళడం, మనసుకు నచ్చే పనులు చేయడం వల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
– రోజుకు కనీసం 6-7 గంటలు నిద్రపోయేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
– తక్కువ కాలరీలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. ఫైబర్‌ ఉండే పదార్థాలు, పండ్లు, తాజా కూరగాయాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
– జీవిత భాగస్వామితో బాంధవ్యాన్ని దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని భాగస్వామితో పంచుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులతో, స్నేహితులతో సమయం గడుపుతుండాలి.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త…
శరీరంలో జరిగే ఏ చిన్న మార్పునూ అంత సులువుగా తీసిపారేయొద్దు.. అప్రత్తతతో ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా తలనొప్పి, కడుపులో ఇబ్బందిగా అనిపించడం, నీరసం… వంటి లక్షణాలు రోజూ ఉంటుంటే మాత్రం పని ఒత్తిడి మూలంగా వస్తున్నాయని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ లక్షణాలు థైరాయిడ్‌ సమస్యకు సంకేతాలు కావచ్చు. ఒకవేళ మీలో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? చెక్‌ చేసుకోండి.
నీరసం : పని చేయకపోయినా రోజూ మధ్యాహ్నం వేళ నీరసంగా ఉంటుంటే.. అనుమానించాల్సిందే. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారిలో కని పించే ప్రధాన లక్షణం నీరసం. జీర్ణ సమస్యలు, డయేరియా లేక మల బద్ధకం థైరాయిడ్లో కనిపించే మరో లక్షణం. కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. బరువులో తేడా థైరా యిడ్‌ గ్రంధి జీవక్రియలను నియంత్రి స్తుంది. బరువు తగ్గుతున్నట్లయితే హైపర్‌ థైరాయిడిజం, బరువు పెరుగుతున్నట్లయితే హైపోథైరాయి డిజంగా భావించాలి. మెట బాలిజం లెవెల్స్‌ పెరగడం, తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.
శ్వాసకోశ సమస్యలు : సోయా, నట్స్‌, క్యాబేజి వంటి ఆహార పదా ర్థాలు థైరాయిడ్‌ పనితీరును తగ్గి స్తాయి. ఇవి తిన్నప్పుడు శ్వాస సమ స్యలు తలెత్తినట్లయితే ఒకసారి చెక్‌ చేయించుకోండి.
డిప్రెషన్‌ : శరీర పనితీరుపైనే కాకుండా మానసిక పనితీరుపైనా హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఎటు వంటి కారణం లేకుండా మూడ్‌ బాగా లేదని అంటున్నారంటే థైరా యిడ్‌ గురించి ఆలోచించాల్సిందే.
గాయిటర్‌ : థైరాయిడ్‌ గ్రంథి పెరగటాన్ని గాయిటర్‌ అంటారు. ఎటువంటి చికిత్స తీసుకోని వారిలో థైరాయిడ్‌ గ్రంధి బాగా పెరిగి గొంతు దగ్గర స్పష్టంగా వాపు కనిపిస్తుంది.
హార్ట్‌ రేట్‌ : ఉద్వేగభరితమైన సంఘటనలు ఏమీ లేకపోయినా హార్ట్‌ బీట్‌ పెరిగిపోతుంటే కనుక థైరాయిడ్‌ సమస్య ఉందేమో చెక్‌ చేసుకోవాలి.
ఆకలి లేకపోవడం : థైరాయిడ్‌ సమస్య ప్రారంభదశలో కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం. బరువు తగ్గుతున్నా, పెరుగుతున్నా ఏమీ తినాలనిపించదు. ఆకలి లేకుండా పోతుంది. ఈ లక్షణాలు కనుక ఉన్న ట్లయితే థైరాయిడ్‌ చెకప్‌ చేసుకుని సందేహాలను నివత్తి చేసుకోవడం ఉత్తమం.