రోజురోజుకు మన ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఎక్కువ రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారానికే అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. తృణధాన్యాల గురించి ఈ మధ్యకాలంలో చాలా మందికి బాగా అవగాహన పెరిగింది. క్రమం తప్పకుండా తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చురుగ్గా ఉండటానికి వీలవుతుందని, ఇతర పదార్థాలతో పోలిస్తే వీటితో చేసిన వంటల్లో పీచు ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ ఇది చక్కని ఆహారం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సైతం ఎంతో ఉపయోగం. తక్కువ సమయంలో తృణధాన్యాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే వివిధ రకాల వంటలు ఏమున్నాయో ఈ రోజు తెలుసుకుందాం…
చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రల్లో మాంసకతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్‌తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చిన్నపిల్లలకు, గర్భిణిలకు మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. కడపునొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం, అతిసారం వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టొచ్చు. వీటిని నిత్యం తినడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ బీ 1 అల్జీమర్స్‌ని దూరం చేస్తుంది. నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ వీటిలో లభిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలోని ప్రోటీన్ సహాయ పడుతుంది. కొర్రలను రెగ్యులర్‌గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.
బిర్యానీ
కావాల్సిన పదార్థాలు : కొర్రలు – కప్పు, కాలీఫ్లవర్ – సగం (కట్ చేసి కొంచెం వేడి నీటిలో మరిగించి పక్కన పెట్టుకోవాలి), క్యారెట్ – రెండు (కావాల్సిన షేప్‌లో కట్‌చేపి పెట్టుకోవాలి), బీన్స్ – వంద గ్రాములు (అంగుళం ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి), కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరగాలి), పుదీనా – కొద్దిగా (సన్నగా తరగాలి), గరం మసాలా – చెంచా, ఉల్లిగడ్డ – ఒకటి (మధ్యస్తంగా ఉండే ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి)
తయారు చేసే విధానం : కొర్రలను గంట పాటు నీళ్లలో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి నెయ్యి వేసి వేడయ్యాక కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, గరం మసాలాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరిగిన క్యారెట్, బీన్స్, కొత్తిమీర, కాలీఫ్లవర్ అందులో వేయాలి. అన్ని కలిపి కొంచెం వేగాక, ఇందులో కప్పు కొర్రలకు రెండు కప్పుల చొప్పున నీటిని పోయాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేయాలి. ఈ మిశ్రమం బాగా మరగబెట్టిన తర్వాత నానబెట్టిన కొర్రలను అందులో వేసి బాగా ఉడికేంత వరకు ఉంచాలి. అంతే కొర్ర బిర్యానీ రెడీ…
అంబలి
కావాల్సిన పదార్థాలు : రాగులు, కొర్రలు, పాలు – అర లీటరు, జీలకర్ర పొడి – కొద్దిగా
తయారు చేసే విధానం : రాగులు, కొర్రలు సమపాళ్ళలో తీసుకుని ఒక పూటంతా నానబెట్టి, మొలక కట్టాలి. మొలకలు వచ్చాక, వీటిని బాగా ఎండబెట్టి పిండి పట్టించాలి. ఈ పిండిని నీటితో కలిపి కొంచెం చిక్కగా తయారయ్యేలా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి. ఇందులో కొంచెం కొంచెంగా ముందుగానే కలిపి ఉంచుకున్న పిండిని ధారగా పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపుతూ ఉండాలి. ఇందులో కొంచెం జీలకర్ర పొడి కూడా కలుపుకోవచ్చు. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ అంబలిని తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
పొంగలి
కావాల్సిన పదార్థాలు : కొర్రలు – పావుకిలో, పాలు – పావు లీటరు, బెల్లం – వంద గ్రాములు, కాజు, బాదం, కిస్మిస్ – పది గ్రాముల చొప్పున.
తయారు చేసే విధానం : ముందుగా కొర్రలను వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిలో వంద మిల్లీలీటర్ల నీటిని పోసి పదినిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత పాలు పోయాలి. మరో పది నిమిషాల పాటు ఆ మొత్తం మిశ్రమం మరిగేలా చేయాలి. ఆ తర్వాత బెల్లం వేయాలి. అయిదు నిమిషాల పాటు ఉడికిస్తే కొర్ర పొంగలి సిద్ధమ వుతుంది. దించిన తర్వాత కాజు, బాదం, కిస్మిస్‌లతో అలంకరించుకోవచ్చు.
కిచిడీ
కావాల్సిన పదార్థాలు : కొర్రలు – ఒక కప్పు, పెసలు – అరకప్పు, తోటకూర – రెండు చిన్న కట్టలు, క్యారెట్ – రెండు, బీన్స్ – వంద గ్రాములు, పచ్చిమిర్చి – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, పోపు గింజలు – చెంచా, నూనె – రెండు చెంచాలు, ఉల్లిగడ్డ – ఒకటి (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), పసుపు – చిటికెడు.
తయారు చేసే విధానం : కొర్రలను నాలుగు గంటల పాటు, పెసలను గంట పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డ ముక్కలను వేసి వేయించాలి. తరిగి ఉంచిన క్యారెట్, బీన్స్, మిర్చి, తోటకూరతో పాటు చిటికెడు పసుపు అందులో కలపాలి. తర్వాత దీనిలో పెసలు వేసి 3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. తర్వాత కొర్రలు వేసి కలపాలి. కప్పు కొర్రలకు ఆరు కప్పుల నీరు చొప్పున పోసి ఉడికించాలి. అంతే కొర్ర కిచిడీ సిద్దం..