ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

– బయోమెట్రిక్‌ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న
– కౌంటర్‌ వేయాలని సర్వీస్‌ కమిషన్‌కు నోటీసులు
– విచారణ వచ్చే నెలకు వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టీఎస్‌పీఎస్‌సీ ఈ నెల 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోలేదని టీఎస్‌పీఎస్‌సీని హైకోర్టు ప్రశ్నిచింది. బయోమెట్రిక్‌ నిర్వహిస్తే ఖర్చు అవుతుందంటూ టీఎస్‌పీఎస్‌సీ చెప్పిన జవాబుతో విబేధించింది. బయోమెట్రిక్‌ తీసుకోకపోవటంతో అక్రమాలకు తెర లేచే ప్రమాదం ఉంటుందనే సందేహాన్ని వ్యక్తం చేసింది. ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలనీ, ఈమేరకు టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించాలంటూ గ్రూప్‌-1 అభ్యర్థులు బి.ప్రశాంత్‌, బండి ప్రశాంత్‌, జి.హరికృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ మాధవీదేవి విచారించారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోరారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.
అభ్యర్థులకు ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌టిక్కెట్‌ నెంబర్‌ లేదన్నారు. ఆ నెంబరు లేకుండా ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్‌ ఎవరికి ఏది ఇచ్చారో గుర్తించడం కష్టమని చెప్పారు. ఇవి తారుమారు చేసే వీలుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ నోటిఫికేషన్‌ ప్రకారం జరగలేదని చెప్పారు. నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి పరీక్షను రద్దు చేసి నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా తిరిగి పరీక్షను నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తే కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని టీఎస్‌పీఎస్‌సీ తరుపు న్యాయవాది ఈ సందర్భంగా చెప్పారు. హాల్‌టికెట్‌లో వివరాలు ఉన్నాయని తెలిపారు. ఇన్విజిలేటర్‌ వద్ద పూర్తి వివరాలు ఉన్నాయనీ, అక్రమాలకు ఆస్కారం లేకుండానే పరీక్ష నిర్వహణ జరిగిందన్నారు.
ఈ క్రమంలో ఖర్చు అవుతుందని బయోమోట్రిక్‌ విధానాన్ని అమలు చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను జులై నెలకు వాయిదా వేసింది.
కోర్టు ఆవరణలో బోర్డుపై నోటీసు
భూమి తమదేనని పేర్కొంటూ మారెడ్‌పల్లి తహశీల్దార్‌ సివిల్‌ కోర్టు ప్రాంగణంలో బోర్డు ఏర్పాటు చేయటంపై విచారణ చేపట్టిన హైకోర్టు రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈసారి కౌంటర్‌ దాఖలు చేయకపోతే సీఎస్‌, ఇతర అధికారులను విచారణకు పిలుస్తామని హెచ్చరించింది. కోర్టు ఆవరణలో బోర్డు ఏర్పాటు చేశారనే సివిల్‌ కోర్టు జడ్జి రిపోర్టును రిట్‌గా పరిగణించిన హైకోర్టు సీజే బెంచ్‌ గురువారం విచారణ జరిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.