– అత్యధిక గుండెపోటు రేటు ఆ రోజే : తాజా పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవన పరిస్థితులతో గుండెపోటు ప్రమాదాలు తీవ్రమవుతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. అయితే స్టెమీ గుండెపోటుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం తాజా పరిశోధనలో బయటకు వచ్చింది. స్టెమీ గుండెపోటుల అధిక రేటు వారం ప్రారంభంలో ఉంటుందని వెల్లడైంది. అందులోనూ సోమవారం అత్యధిక రేటును కలిగి ఉండటం గమనార్హం. మాంచెస్టర్‌లోని బ్రిటీశ్ కార్డియోవాస్కులర్ సొసైటీ (బీసీఎస్) కాన్ఫరెన్సులో సమర్పించబడిన పరిశోధన దీనిని వెల్లడించింది. ఎస్‌టీ-సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) అనేది ఒక తీవ్రమైన గుండెపోటు. దీనిలో కరోనరి ఆర్టరీ పూర్తిగా నిరోధించబడుతుంది.
10 వేల మంది రోగుల డేటా పరిశీలన
బెల్ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నిర్వహించిన పరిశోధనలో ” పని వారం ప్రారంభం, స్టెమీ సంభవం మధ్య బలమైన గణాంక సహసంబంధం ఉన్నది” అని డాక్టర్ జాక్ లాఫాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధంగా స్టెమీ గుండెపోటు సోమవారం నాడు గరిష్టస్థాయికి చేరుకుంటుందని వివరించారు. ఈ ప్రమాదం ఆదివారం కూడా ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్టు కనుగొనటం గమనార్హం.బెల్ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వైద్యులు 2013 నుంచి 2018 సంవత్సరాల మధ్య ఐర్లాండ్‌లోని పది వేల మంది రోగుల డేటాను పరిశీలించారు. ఈ ఐదేండ్లలో స్టెమీ ఫలితంగా ఆస్పత్రులలో చేరిన రోగులు చుట్టూ ఈ డేటా కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.
సోమవారాలు ఎందుకు?
స్టెమీ మరియు పని వారం ప్రారంభం మధ్య పరస్పర సంబంధం గురించి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ జాక్ లాఫాన్ వెల్లడించారు. అయితే, దీనికి గల కారణం ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నప్పటికీ.. శాస్త్రవేత్తలు మాత్రం ఈ దృగ్విషయం సిర్కాడియన్ రిథమ్ లేదా శరీరం నిద్ర మేల్కొనే చక్రానికి సంబంధించినదని భావిస్తున్నారు. ఈ అంశంపై మునుపటి పరిశోధన కూడా హృదయ సంబంధిత ఘటనలు సోమవారాల్లోనే ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నదని సూచించింది. 2005లో జరిపిన పరిశోధనలు ఈ సంఘటనలకు వారాంతంలో అతిగా మద్యపానం ప్రభావంగా పరిగణించబడ్డాయి. అయితే, ఇది నిరూపితం కాలేదు.