గుండెల్లో హాయిరాగాలు మోగించిన పాట

గుండెల్లో హాయిరాగాలు మోగించిన పాటప్రేమలో ఉంటే సెకనుకొక వేడుకలా అనిపిస్తుంది. నిమిషానికో పండుగలా అనిపిస్తుంది. ఒకరినొకరు విడిచి ఉండలేమనిపిస్తుంది. కలిసి ఉంటే కాలం వరదలా పారినట్టనిపిస్తుంది. విడిచి ఉంటే కాలం శిలలా కదలనట్టనిపిస్తుంది. అలాంటి ప్రేమబంధాన్ని తెలిపే, హాయిసుగంధాల్ని విరజిమ్మే మధురమైన పాటను ‘నిన్ను కోరి'(2017) సినిమా కోసం రామజోగయ్యశాస్త్రి రాశాడు. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
ప్రేమ చిగురించాక గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. తొలిసారి ప్రేయసితో కలిసి అడుగులేస్తూ ఉంటే ప్రియునికి ఏదో తెలియని గుబులు, పులకింతలు కలుగుతాయి. ప్రియునికే కాదు ప్రేయసికీ ఇదే మైమరపు కలుగుతుంది. అదే మరి ప్రేమ మహిమ అంటే.. ప్రేమ చేసే వింతగారడిని, ఆ గారడి వల్ల ప్రేమికుల్లో కలిగే ఆనందాన్ని తెలియజేస్తూ నిన్నుకోరి సినిమా కోసం అద్భుతమైన పాటను రామజోగయ్యశాస్త్రి రాశాడు.
‘శివనిర్వాణ’ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నుకోరి’ సినిమా కథపరంగా, సంగీతపరంగా, సాహిత్యపరంగా సెన్సేషనల్‌ హిట్‌. ఈ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. ‘ఉన్నట్టుండి గుండె’ పాట ఇప్పటికీ చాలామంది గుండెల్లో మోగుతూనే ఉంది. ఎందరికో చరవాణుల్లో కాలర్‌ టోన్‌గా అలరిస్తూనే ఉంది.
కథపరంగా చూసినట్లయితే కథానాయిక డ్యాన్స్‌ నేర్చుకోవడం కోసం హీరోను పరిచయం చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె మొదట హీరో డ్యాన్స్‌ చూసే ముగ్ధురాలవుతుంది. అతన్ని డ్యాన్స్‌ నేర్పించమని వెంటపడుతోంది. అతడు కాదనలేక సరే అంటాడు. ఆమెకు డ్యాన్స్‌ నేర్పించడంతో పాటు ఆమెలో ఉన్న పిరికితనాన్ని పోగొడతాడు. వారిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఆమెకు అన్నివేళలా అండగా ఉంటూ ఆమె మనసులో స్థానం సంపాదించుకుంటాడు. ఇలాంటి మనిషి తన జీవితానికి తోడైతే ఇంకెంతో సాధిస్తానన్న నమ్మకంతో ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అతను కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి చేస్తున్న హీరో చదువును, తన ప్రేయసిని రెండు కళ్ళుగా చేసుకొని తన జీవితాన్ని సరికొత్తగా మొదలుపెడతాడు. ఇద్దరి మధ్యన అంకురించిన ప్రేమకు అక్షరరూపమే ఈ పాట..
ఉన్నట్టుండి నా గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవలసిన గుండె 100 సార్లు కొట్టుకుంటుందేంటి? ఇది ప్రేమ మహిమేనా? సంతోషాలు నిండి ఉన్న బంధం ప్రేయసి రూపంలో నన్ను ఈ వేళ అల్లుకుంది. అసలు ఈ ముడి ఎప్పుడు పడింది. అని తనను తాను ప్రశ్నించుకుంటాడు హీరో. నిజానికి ముడిపడిన సంగతే అతను గ్రహించలేడు. అంటే.. అంత ఆశ్చర్యంలో, తెలియని పరవశంలో అతడున్నాడు. నేనా, ఇలా, ఇక్కడ ఈ సమయాన నీతో కలిసి నడుస్తున్నానా? ఇది నిజమేనా? అవునా? ఆహా అని ఆశ్చర్యంలో మునకేస్తున్నానా? అంటున్నాడు. నన్ను మెచ్చిన, నాకు నచ్చిన అమ్మాయి ముచ్చట గొలిపే విధంగా నన్ను హత్తుకుపోయింది. చుక్కలు కూడా చూడనంత ఎత్తైన లోకంలోకి చప్పున నన్ను తీసుకెళ్ళిపోయింది. ఇది కలనా? లేక నిజమా? అన్న సందిగ్ధ పరిస్థితిలో హీరో ఉన్నాడు.
ఏ దారం ఇలా నన్ను నీవైపుకు లాగిందో మరి. నాకు తెలియకుండానే నీతో ఈ బంధం ఏర్పడింది. నీ తోడై ఉన్నాను కాబట్టి పట్టరాని పరవశం నన్ను పట్టి ఊపేస్తోంది. మనసు పొంగిపోతోంది. అడిగితే అందిన వరం కాదిది. అడగకుండానే నాకు అందినవరం నువ్వు. నేను పొందిన వరం నువ్వు అంటున్నాడు. తనకు తానుగా చెలియే నాకు కానుకలా దొరికింది. ఇది నా జీవితానికే వెలలేని కానుక. నాకు సరికొత్త జీవితమే తానై అందినదా అనిపిస్తుంది. ఇకపై సెకనుకొక వేడుకలా అనిపిస్తుంది. ఎందుకంటే వేడుకలకు, ఆనందానికి చిరునామా అయిన ప్రేయసి తన పక్కన ఉంది కాబట్టి. ప్రేయసి మనసును తాను గెలుచుకున్నాడు కాబట్టి. తాను కన్న కల చెలిలా తన ముందు నిలిచిందా? నిజమై తన దగ్గరకి చేరుకుందా? అని అనిపిస్తుందట హీరోకి. ఇలా హీరో మైమరచి పాడుతుంటాడు. ఇది హీరోకి కలిగిన వింత పరవశం. మరి ప్రేయసికి కలిగిన ఆనందమేమిటో చూద్దాం.
ఆనందం సగం, ఆశ్చర్యం సగం. ఇది ప్రేయసి మన:స్థితి. ఆమె మనసు సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతోంది. ఎందుకంటే తను కోరుకున్నవాడు ఎలా ఉండాలనుకుందో అలాంటివాడే తనకు ఎదురయ్యాడు. తాను ఓడిపోతున్నాననుకుంటున్న సమయంలో గెలుపై చేరుకున్నాడు. తాను నిరాశలో కుంగిపోతున్నాననుకుంటున్న సమయంలో ఆశై నడిపించాడు. ఆనందంలో, ఆశ్చర్యంలో ఉన్నాను కాని, కలలో మాత్రం నేను లేను. ఇది ఏమైనా నిజమే. నాకు దొరికిన వరం నిజమే. నాకు ప్రాణమై చెంత చేరిన ప్రేమా నిజమే. అని ప్రేయసి తను పొందుతున్న సంతోషాన్ని కలగా భావించకుండా అక్షరాలా నిజమని నిర్ధారిస్తుంది.
కాలం కదలికల సాక్షిగా ప్రేమై మన జీవితం కదులుతున్నది. అంటే కాలం ఉన్నంత వరకు, కాలం ప్రయాణిస్తున్నంత వరకు నీతో నా ప్రయాణం ప్రేమలా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా సాగుతూ ఉంటుంది. అని ఆమె తన ప్రియుడితో ఉంటే జీవితం పరమానందంగా, పరమాద్భుతంగా ఉంటుందని నిస్సందేహంగా, నిస్సంకోచంగా ప్రకటిస్తుంది. ఇకపై నా ప్రయాణం నీతో పదిలంగా సాగుతుంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. జీవితం నవ్వుల పువ్వులమయమవుతుంది. సంతోషానికి సంకేతమవుతుంది. నీతో అటో ఇటో ఎటో ఏవైపుకు వెళ్ళినా సరే నీ తోడుంటే నా జీవితం పదిలంగా ఉంటుంది. నాకు ఏ అడ్డూ ఉండదు. అని ప్రేయసి ప్రియునిపట్ల తనకున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది. విడదీయరానంత గాఢమైన ప్రేమానుభూతుల్లో వాళ్ళిద్దరు తేలియాడుతుంటారు. నాని, నివేదాథామస్‌ ల నటన ఈ సినిమాకు, ఈ పాటకు ప్రత్యేకమైన వన్నె తెచ్చింది. గోపీసుందర్‌ సంగీతం, కార్తీక్‌, చిన్మయి శ్రీపాద గానం కూడా ఈ పాటకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి.
ప్రేమ చేసే మహిమను గూర్చి తెలిపిన ఈ పాట ఎన్నేళ్లు గడిచినా నిత్యనూతనమే. ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ప్రేమ నిండిన జీవితం మధురాతి మధురమైనదన్న గొప్ప సందేశాన్నిస్తుందీపాట. ప్రేమికులందరికి అపురూపమైన కానుక ఈ పాట. అలవికాని ఎన్నెన్నో అనుభూతుల సమాహారమే ఈ పాట..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,sharathchandra.poet@yahoo.com