అసోంలో భారీ వరదలు

– 9 జిల్లాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులు
దీస్‌పూర్‌ : అసోంలో భారీ వరదలు వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. తొమ్మిది జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద నీరు మెల్లగా తగ్గుముఖం పడుతోంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అసోం స్టేట్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) అధికారులు తెలిపారు. పలు బృందాలు సహాయక చర్యల్లో నిమగమయ్యాయి. ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
  ఎస్‌డిఎంఎ నివేదిక ప్రకారం.. బక్సా, ఉదల్‌గురి, నల్‌బారి, లఖింపూర్‌, కమ్రూప్‌, గోల్‌పరా, ధుబ్రి, దర్రాంగ్‌, బార్‌పేట జిల్లాలకు చెందిన నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు. ప్రజల సహాయార్థం 101 శిబిరాలు నిర్వహిస్తున్నారు. 81 వేలమందికి పైగా ఇక్కడ ఆశ్రయం పొందారు. ఐదు జిల్లాల్లో 119 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. 1,118 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. వరదల కారణంగా రైతుల పంటలు నాశనమయ్యాయి. 8,469.56 హెక్టార్ల భూమి పూర్తిగా నీట మునిగింది.
కరీంగంజ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. తొమ్మిది జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయంటే వరద బీభత్సాన్ని ఊహించవచ్చు. అసోం సిఎం హిమంత బిస్వా శర్మకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.