ఎలక్షన్‌ కోడ్‌లో జోరుగా మద్యం అమ్మకాలు

In the Election Code Heavy alcohol sales– రోజుకో కొత్త బెల్ట్‌ షాపు ఏర్పాటు
– వైన్‌ షాపుల కనుసన్నల్లోనే దందా
– పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ అధికారులు
నవతెలంగాణ-నరసింహుల పేట
ఎన్నికల సమీపిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో బెల్ట్‌ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మహబూబాబాద్‌ జిల్లా గ్రామాలు, శివారుల్లో ఈ దందా జోరుగా సాగేది. ఇప్పుడు నరసింహుల పేట చౌరస్తా నడిబొడ్డులోని కాలనీల్లో సైతం నడుస్తోంది. ఇదంతా వైన్‌ షాపుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంతోపాటు 22 గ్రామపంచాయతీల్లో సుమారు 650 బెల్ట్‌ షాపులున్నాయి. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా వైన్‌ షాపులు, లిక్కరు దందాను కొనసాగించేందుకు బెల్ట్‌ షాపులను వారే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న, గుడుంబా అమ్మకాలు జరుపుతున్న వారిని గుర్తించి వారికి.. గొర్రెలు, బర్రెలు, ట్రాలీ, ప్యాసింజర్‌ ఆటోలు, కిరాణా షాపులు తదితర స్వయం ఉపాధి పనుల కోసం ప్రభుత్వం ఆర్థిక చేయూతనందించింది. అయితే లబ్ది పొందిన వారు తమ వ్యాపారాలు చేసుకుంటూనే బెల్ట్‌ షాపులనూ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌ దందాను కట్టడి చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుండటంతో బెల్ట్‌ దందా జోరుగా కొనసాగుతూనే ఉంది.
వైన్‌ షాపుల కనుసన్నల్లోనే..
వైన్‌ షాపుల కనుసన్నల్లోనే బెల్ట్‌ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినివస్తున్నాయి. మండల కేంద్రంలో రెండు బ్రాండ్‌ షాపులున్నాయి. అందులో ఒకటి రిటైల్‌, రెండవది బ్రాండ్‌ షాప్‌. ఓ వైన్‌ షాపు ఓనర్‌ తనకు కావాల్సిన వారి బెల్ట్‌ షాపునకు నేరుగా స్టాకు పంపిస్తున్నట్టు బాహటంగానే ప్రచారం సాగుతోంది. వైన్‌ షాపు యజమానులే గ్రామాలు, తండాల్లో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తూ అక్కడికి నేరుగా సరఫరా చేస్తున్నట్టు సమాచారం. నిబంధనల మేరకు ఒక్కరికి ఆరు ఫుల్‌ బాటిళ్లనే విక్రయించాలి. అందుకు విరుద్ధంగా పదుల సంఖ్యలో ఫుల్‌ బాటిళ్లను, క్వాటర్లు, నచ్చిన బ్రాండ్లు బెల్ట్‌ షాపునకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైన్‌ షాపుల యజమానుల నిర్వాకంతో పలు గ్రామాలు, తండాలు, కాలనీల్లో రోజుకో కొత్త బెల్ట్‌ షాపు పుట్టుకొస్తున్నట్టు ప్రజలు వాపోతున్నారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా బెల్ట్‌ షాపులపై కేసు నమోదు చేసిన పాపానపోలేదని పలు ప్రజాసంఘాల నాయకులు, డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎలక్షన్‌ కోడ్‌లో మందు అమ్మకుండా కట్టడి చేయాలని వాళ్లు డిమాండ్‌ చేశారు.
నిరంతరం తనిఖీలు చేస్తున్నాం : బి. భాస్కర్‌, తొర్రూర్‌ ఎక్సైజ్‌ సీఐ
బెల్ట్‌ షాపులు నిర్వహించడం నేరం. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం. దొరిన మద్యాన్ని సీజ్‌ చేస్తూ వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అయితే వైన్‌ షాపులే బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న ఆధారాలు మాకు దొరకడం లేదు. ఆధారాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత వైన్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండి బెల్ట్‌ షాపులపై ఫిర్యాదు చేయాలి.