
నవతెలంగాణ-గోవిందరావుపేట
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 163 వ జాతీయ రహదారిపై రాస్తారోకో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం పార్టీ గోవిందరావుపేట మండల కమిటీ సభ్యుడు సోమ మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పసర చౌరస్తా 163వ జాతీయ రహదారిపై వరద బాధితులతో కలిసి భారీ రాస్తారోకో నిర్వహించారు .ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం వరద బాధితులను ఉద్దేశించి మల్లారెడ్డి మాట్లాడుతూ గత రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలతో ప్రజలు సర్వస్వం కోల్పోయారని ఆయన అన్నారు. పొలాలలో ఇసుక మేటలు వేసి రైతాంగం కన్నీటి పర్యంతం అవుతున్న ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని అదేవిధంగా ఇళ్లల్లోకి నీరు వచ్చి గొర్రెలు మేకలు పశు సంపద సర్వస్వం కోల్పోయిన వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన అన్నారు. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇల్లు కోల్పోయిన వారికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యుదయ కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టి అభ్యుదయ కాలనీ వాసులను వరద ముంపు నుండి కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు అంబాల పోశాలు ముమ్మడి ఉపేంద్రచారి అంబాల మురళి గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు జుట్టబోయిన రమేష్ మంచోజు బ్రహ్మచారి బుర్ర శ్రీనివాస్ రెడ్డి పురుషోత్తం ఐద్వా మహిళ జిల్లా కార్యదర్శి కారం రజిత బత్తుల సీత జిమ్మ జ్యోతి మచ్చ సువర్ణ సంకినేని రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.