– 20 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం
– వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీదే విజయం
– ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల పాట్లు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రానున్న ఎన్నికల్లో గెలిచి శాసనసభలో ఎవరు అడుగుపెట్టాలన్నా.. అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నా మహిళల ఓట్లే కీలకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలుండగా అందులో 20 జిల్లాల్లో పురుషుల ఓట్ల కంటే మహిళలే ఓట్లే అధికంగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఎనిమిదింటిలో మహిళల కంటే పురుషుల ఓట్లు తక్కువగా ఉన్నాయి. రెండింటిలో మాత్రమే పురుషుల ఓట్లు అధికంగా ఉన్నాయి. గెలుపోటములు నిర్ణయించే శక్తి మహిళలదే కావడం విశేషం. అందుకే మహిళల ఓట్లను రాబట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సైతం దృష్టిసారించాయి. మ్యానిఫెస్టోల్లో మహిళలకు ప్రత్యేకస్థానం కల్పించాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆయా పథకాలను అమలు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నాయి. ఏ సభ జరిగినా మహిళలకు కేటాయించబోయే పథకాల గురించే నేతలు ప్రస్తావిస్తున్నారు. కర్నాటకలో చేసి చూపించామని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా, తెలంగాణలో గతంలోనే మహిళాభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నామని బీఆర్‌ఎస్ చెబుతోంది. ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని, మరిన్ని పథకాలు అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన వాటిని వెల్లడిస్తున్నారు. మహిళలు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఎన్నికలు రావడంతో మహిళలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నాయి. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాలో మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే… మొత్తం ఓటర్లు 22,16,690 ఉండగా పురుషులు 10,91,034 మంది ఉన్నారు. మహిళలు 11,25,656మంది నమోదయ్యారు. ఆదిలాబాద్, బోథ్, చెన్నూర్, మంచిర్యాల, నిర్మల్, ముధోల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పురుషుల ఓట్ల కంటే మహిళలే అధికంగా ఉన్నాయి. సిర్పూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వారి మ్యానిఫెస్టోలో మహిళల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయి. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ సౌభాగ్యలక్ష్మీ పేరిట పేద మహిళలకు నెలకు రూ.3వేల చొప్పున అందజేస్తామని, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి సౌకార్యలు అందిస్తామని పొందుపర్చగా.. కాంగ్రెస్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు మహాలక్ష్మీ పేరిట నెలకు రూ.2500చొప్పున అందజేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తా మని ప్రకటించింది. ఇలాంటి ప్రయత్నాల ద్వారా మహిళల ఓట్లను అధికంగా పొందవచ్చనే ఆలోచనలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. గెలుపోటములను శాసించే స్థాయిలో మహిళల ఓట్ల సంఖ్య ఉండటంతో ఆయా పార్టీలు సైతం వీరి ఓట్లపై గురిపెట్టాయి. ప్రచారంలోనూ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. పార్టీలు నిర్వహిస్తున్న సభలకు సైతం మహిళా ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించేలా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.