పెండ్లి అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మారడం. పెండ్లి తర్వాత భార్యా, భర్తలు అన్యోన్యంగా కలిసి జీవించాలని కోరుకుంటారు. ఎంత ప్రేమగా ఉన్నా చిన్నచిన్న గొడవలు, మనస్పర్థలు సహజం. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించేలా చేసేదే పెండ్లి. అయితే కొంత మంది చిన్న విషయాలకే విడిపోవాలని చూస్తుంటారు. ఇంకొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా విడిపోకుండా అలా భరిస్తూ ఉంటున్నారు. ఆ బంధం నుండి బయటకు రావడానికి ఇష్టపడరు. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్…
పవిత్రకు 26 ఏండ్లు, రఘుకు 28 ఏండ్లు. ఇద్దరికీ పెండ్లి జరిగి ఆరు నెలలు అవుతుంది. రఘు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పవిత్ర కూడా ఇక్కడ సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇద్దరి జోడీ బాగుంటుందని పెద్దలు మాట్లాడుకొని సంబంధం కుదిర్చారు. పెండ్లికి ముందు ఆరు నెలల వరకు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకున్నారు. రఘుకు కట్నంగా 25 లక్షల రూపాయలు, 32 తులాల బంగారం, రెండు కిలోల వెండి ఇచ్చారు. పెండ్లి తర్వాత ఇరు కుటుంబ సభ్యులు కలిసి తీర్థయాత్రలు కూడా చేశారు. అయితే రఘు, పవిత్రకు జరగాల్సిన మొదటి రాత్రిని మాత్రం మూహుర్తాలు బాగోలేదని నెల రోజులు గడిపేశారు.
చివరకు పవిత్ర ఇంట్లో వాళ్లే ముహుర్తం చూసి కార్యక్రమం జరపడానికి ఏర్పాట్లు చేశారు. కానీ రఘు ఇష్టపడలేదు. కొత్త కదా కంగారు పడుతున్నాడని కాస్త సమయం ఇద్దామనుకున్నారు. ఈలోపు పవిత్రకు వీసా రెడీ అయ్యింది. ఇద్దరూ కలిసి అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ కూడా రఘు, పవిత్రను దూరం పెట్టేవాడు. దాంతో పవిత్రకు అనుమానం వచ్చింది. ‘మీరు నన్నెందుకు దూరం పెడుతున్నారు. నేనంటే ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా! లేదా ఇంకేదైనా సమస్య ఉన్నా చెప్పండి, డాక్టర్ సలహా తీసుకుందాం’ అని ప్రేమగా అడిగింది.
దానికి అతను ‘నువ్వుంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎందుకో చాలా భయంగా ఉంది. అందుకే ఏడాది నుండి మందులు వాడుతున్నాను’ అన్నాడు. ‘మనం వేరే డాక్టర్ దగ్గరకు వెళదాం. మీకు ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ మందులతో పాటు కౌన్సెలింగ్ కూడా ఇస్తారు’ అని చెప్పి రఘును డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలనుకుంది. కానీ అతను రాలేదు. ఇద్దరూ అక్కడ ఉన్న తమ స్నేహితుల ఇండ్లకు వెళ్లేవారు. పవిత్ర ఫ్రెండ్ ఒకరు ఇద్దరూ దూరంగా ఉండటం గమనించి అనుమానంగా అడిగింది. పవిత్ర ఆమెకు విషయం చెప్పింది. ఆమె కూడా తనకు తెలిసిన డాక్టర్ గురించి చెప్పి వెళ్ళి కలవమని సలహా ఇచ్చింది. కానీ పవిత్ర ఈ విషయం గురించి రఘుతో మాట్లాడలేదు. కానీ ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి రఘు ప్రవర్తనలో మార్పు వచ్చింది.
ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, గొడవ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు పవిత్రపై చేయిచేసుకునే వరకు వెళ్లాడు. ఇండియా నుండి రఘు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి పవిత్రను తిట్టేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. జాబ్‌పైన కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోయింది. తిరిగి ఇండియా వచ్చేద్దామంటే పెండ్లి తర్వాత ఇలా భర్త నుండి విడిపోవడం ఎందుకని ఆలోచించింది. చివరకు రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. దాంతో పవిత్రను ఆమె తల్లిదండ్రులు అమెరికాలో ఉండే వాళ్ల బంధువుల ఇంటికి పంపించారు. చివరకు అసలు సమస్య ఏంటని తెలుసుకుంటే రఘు సంసార జీవితానికి పనికి రాడని తెలిసింది. డాక్టర్‌కు చూపించినా ఉపయోగం లేదు. పెండ్లికి ఏడాది ముందు నుండే అతను మందులు వాడుతున్నాడు. తనలోని సమస్యలను దాచడం కోసం పవిత్రను హింసించడం మొదలుపెట్టాడు.
ఈ విషయాలన్నీ పవిత్రకు తెలియడంతో ‘నేను పెండ్లి చేసుకోనంటే మా ఇంట్లో వాళ్లు బలవంతంగా చేశారు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తాను’ అని పవిత్రను బెదిరించాడు. ఇక విషయం తెలుసుకున్న పవిత్ర బంధువులు ఆమెను ఇండియా పంపించేశారు. ఆమె ఇండియాకు వచ్చి రెండు నెలలైనా రఘు నుండి కానీ, వారి కుటుంబం నుండి కానీ ఆమెకు ఎవ్వరూ ఫోన్ చేయలేదు. వీళ్లు వెళ్లినా రానీయడం లేదు. ‘అమెరికాలో మా కొడుకును బాగా ఇబ్బంది పెట్టావు, ఏ మోహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు’ అని గొడవ చేశారు. రఘుకు ఫోన్ చేసినా తియ్యడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఆమె ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
మేము రఘు కుటుంబ సభ్యులకు లెటర్ పంపించినా రాలేదు. పైగా అడ్వకేట్‌తో మాకు సమాధానం పంపించారు. ఫోన్ చేస్తే ‘మా అబ్బాయి తప్పేం లేదు. పవిత్రకే ఏ పనీ చేయడం రాదు. వాళ్ల అమ్మానాన్న ఆమెకు ఏమీ నేర్పలేదు. ఎప్పుడూ ఆమెను బయట తిప్పాలంటది. మేము మా అబ్బాయితో మాట్లాడినా ఒప్పుకోదు. గొడవ పెట్టుకుంటది. భరించలేకే రఘు ఆమెను ఇండియా పంపించేశాడు. ఇక ఆమెతో మాకు ఎలాంటి సబంధం లేదు. ఐదు లక్షలు ఇస్తాము. రఘును వదిలి వెళ్లిపొమ్మనండి’ అంది వాళ్ల అమ్మ.
దానికి మేము ‘పెండ్లి జరిగి ఆరు నెలలే అవుతుంది. అప్పుడే విడాకులేంటి. ముందు ఆఫీసుకు రండి కూర్చొని మాట్లాడుకుందాం’ అన్నాం. దానికి ఆమె ‘మేము రాము. ఐదు లక్షలు ఇస్తామంటున్నాము కదా తీసుకొని వెళ్లమనండి’ అంది. దాంతో మేము రఘుకు ఫోన్ చేస్తే తప్పంతా పవిత్రదే అన్నట్టు చెప్పాడు. అతనిలో ఉన్న లోపం గురించి మాట్లాడితే ‘అందుకే కదా ఐదు లక్షలు ఇస్తామంటున్నాము’ అని తల్లీలాగే కొడుకూ మాట్లాడాడు.
కానీ పవిత్రకు రఘును వదులుకోవడం ఇష్టం లేదు. ‘పెండ్లిలో రఘుకు 25 లక్షల కట్నం, బంగారం, వెండి ఇచ్చాం. ఇందులో పది తులాల బంగారం, రెండు కిలోల వెండి వారి దగ్గరే ఉంది. పెండ్లి ఖర్చు దాదాపు 11 లక్షలు అయ్యింది. మాతో ఇంత ఖర్చు పెట్టించారు. ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చి పొమ్మంటున్నారు. అతన్ని ఇండియాకు పిలిపించి డాక్టర్‌తో ట్రీట్‌మెంట్ చేయిస్తే బాగుంటుంది. అంతే కానీ నేను విడాకులు ఇవ్వను’ అంది.
‘ఎన్ని మందులు వాడినా అతను సంసారానికి పనికి రాడని డాక్టర్లు చెప్పారు. పైగా అతనేమైనా నిజాయితీ పరుడా అంటే అదీ లేదు. తన తప్పు కప్పిపుచ్చుకోడానికి నిన్ను హింసించాడు. అలాంటి వ్యక్తితో జీవితాంతం నువ్వు ఎలా ఉంటావు’ అని అడిగాము. దానికి ఆమె ఇప్పుడు నన్నేం చేయమంటారో మీరే చెప్పండి’ అంది.
‘రఘు అమెరికాలో డాక్టర్ల దగ్గర చూపించుకొని చికిత్స తీసుకుంటున్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా’ అని అడిగాము. ఆమె దగ్గర ఉన్న ఆధారాలు చూపించింది. వాటితో రఘుపైన, వారి కుటుంబ సభ్యులపై కేసు పెట్టించాము. ఇప్పుడు వాళ్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. లామర్ సహాయంతో కోర్టు ద్వారా పవిత్రకు రావల్సిన కట్నం డబ్బు, బంగారం, వెండితో పాటు నష్టపరిహారం కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. పవిత్రకు మళ్లీ కొత్త జీవితం మొదలపెట్టమని కౌన్సిలింగ్ ఇస్తున్నాము.
– వై వరలక్ష్మి,
9948794051