ఎత్తుకు పైఎత్తు..

High and high..– జనం దృష్టి ఏమార్చడమే లక్ష్యం.. పీక్‌స్టేజ్‌కి రాజకీయ ఆధిపత్యపోరు
– సెప్టెంబర్‌ 17పైనే ‘పొలిటికల్‌’ ఫోకస్‌
– అధికారం కోసం నానా అవస్థలు
– ‘ఓటర్‌ దేవుడి’ ప్రసన్నతే లక్ష్యం
సెప్టెంబర్‌ 17 తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలు నానాతంటాలు పడుతున్నాయి. దానికోసం ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. అదే సమయంలో జనం తమ గురించి మాత్రమే మాట్లాడుకోవాలనే తాపత్రయాన్నీ కనబరుస్తున్నాయి.ఇందుకు భిన్నంగా సాయుధ పోరాట వారసత్వాన్ని, వాస్తవాలను ప్రజలకు అందించేందుకు వామపక్షాలు కృషి చేస్తున్నాయి.
బి. బసవపున్నయ్య
రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలన్నీ ఇప్పుడు అధికారం కోసం వెంపర్లాడుతున్నాయి. ప్రజలకు తామేం మంచి చేస్తామో చెప్పడం మానేసి, ప్రతిపక్షాల్ని ఎలా తక్కువ చేయాలి అని అధికారపార్టీ, అధికారపార్టీని ఎలా ఇరుకునపెట్టి జనం దృష్టిని తిప్పుకోవాలి అని ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ప్రతి ఏడాది మాదిరే ఇప్పుడు కూడా సెప్టెంబర్‌ 17 తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం చుట్టూనే ‘సెంటిమెంట్‌’ రాజకీయం తిరుగుతున్నది. ఆరోజు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ‘విమోచన దినోత్సవాలు’ నిర్వహిస్తామనీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇక దాదాపు 17 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్ని ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించి, 17వ తేదీన పదిలక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఓటర్లు వీరిద్దరి మాయలో పడి తమపై శీతకన్ను వేస్తారేమో అనే భయంతో అధికారపార్టీ ప్రభుత్వ సహకారంతో సెప్టెంబర్‌ 16న ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రచారాలు జనం చెవికి చేరకూడదనుకున్నారో ఏమో కానీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆ తర్వాతి రెండు రోజులు కృష్ణా జలాలతో గ్రామాల్లోని గుళ్లలో దేవుళ్ల పాదాలు కడగండని తన పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. దీనికోసం ఏకంగా మంత్రులకే బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్‌ 17న ఏటా బీజేపీ చేసే రాజకీయ రచ్చ రెండేండ్లుగా పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర హౌం మంత్రి సభతో సరిపుచ్చుతున్న విషయం తెలిసిందే. ఎటూ ఆపార్టీతో బీఆర్‌ఎస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందనే విషయంపై జనంలో చర్చా జరుగుతున్నది.
అటుతిరిగి, ఇటుతిరిగి జనం కాంగ్రెస్‌ ‘ఓటు ఉచ్చు’లో పడతారేమో అనే డౌట్‌ ఆ రెండు పార్టీల్లోనూ దడ పుట్టిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో హస్తం హవా వీచి, అక్కడి బీజేపీ ప్రభుత్వం మట్టికరిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ కర్ణాటక ఊపు సహజంగానే పొరుగురాష్ట్రం తెలంగాణలో కూడా ఉంటుందనే అంచనా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఉంది. దానితో పోటాపోటీగా సెప్టెంబర్‌ 17ను కేంద్రీకృతం చేసుకొని కార్యక్రమాల రూపకల్పనకు మూడు పార్టీలు నానా హైరానా పడుతున్నాయి.
అదే టైంలో అసలు తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధమే లేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందంటూ వామపక్షాలు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి రాజకీయ ప్రచారం లేకుండా ఆనాటి పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సాయుధపో రాటం నాటికి బీఆర్‌ఎస్‌పార్టీనే లేదు కాబట్టి చర్చే లేదు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఓటరు దృష్టి తమపై నుంచి మరలకుండా చూసుకోవడం కోసం రాష్ట్రంలో మూడుముక్కలాట రాజకీయం రస కందాయంలో పడింది. మొత్తానికి సెప్టెంబర్‌ 17న మీడియాను ‘మాయ’ చేసేదాన్ని బట్టి, జనం మూడ్‌ ఉంటుందని మూడు పార్టీలు భావిస్తు న్నాయి. మరి ‘ఓటరు దేవుడు’ ఎలా కరుణిస్తాడో!?