నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు హైకోర్టు జరిమానా విధించింది. రాష్ట్ర మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేసిన కేసులో అడ్వొకేట్ కమిషనర్ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పకుండా గడువు కోరడంతో రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సైనిక సంక్షేమ నిధికి చెల్లించిన తర్వాతే కమిషనర్ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పాలని ఆదేశించింది. ఇప్పటికే గడువు కోరారనీ, మళ్లీ ఇప్పడు గడువు కోరడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల పిటిషన్లో విచారణను ముగిస్తామని హెచ్చరిక చేసింది. ఈ నెల 12న హాజరవుతారని బండి తరపున లాయర్ చెప్పడంతో ఈసారికి మాత్రమే అనుమతిస్తున్నట్టు జస్టిస్ సుమలత చెప్పారు.
2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ ఎన్నికల అఫిడవిట్లో గంగుల వాస్తవాల్ని దాచిపెట్టారనీ, ఆ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని కోరుతూ ఆయనపై బీజేపీ తరఫున పోటీ చేసిన బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షుల విచారణ కోసం అడ్వొకేట్ కమిషనర్గా రిటైర్డ్ జడ్జి శైలజను హైకోర్టు నియమించింది.
గత రెండుసార్లు వేర్వేరు కారణాలతో బండి హాజరు కాలేదు. ఇప్పుడు అమెరికా వెళ్లిన కారణంగా వాయిదా కోరడంపై హైకోర్టు జరిమానా విధించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.