హిమాచల్‌ వరదలను

– ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలి
– ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి సుఖవీందర్‌ సింగ్‌ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌ ఎదుర్కొంటున్న వరదలను జాతీయ విపత్తును ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డం, పిడుగులు పడ్డం వంటి సంఘటనలతో రూ. 12 వేల కోట్ల నష్టాన్ని రాష్ట్రం చవిచూస్తున్నందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జి-20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు హాజరైన ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌ సింగ్‌ ప్రధానితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 400 మందికి పైగా మరణించారని, 13 వేలకు పైగా ఇళ్లు నాశనమయ్యాయని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని మోడీకి తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌ పునర్నిర్మాణానికి కేంద్రం విశేష సహాయం అందించాలని కోరారు.