– కర్మకాండలు, జ్యోతిష్యంపై విద్యా బోధన
న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో గత కొన్ని నెలలుగా భారతీయ విశ్వవిద్యాలయాలలో హిందూ మతం, హిందూ అధ్యయనాలకు సంబంధించిన కోర్సులు, వాటికి అనుబంధంగా రూపొందించిన సబ్జెక్టుల సంఖ్య పెరిగిపోతోంది. ఉదాహరణకు కాన్పూర్‌లోని ఛత్రపతి సాహూజీ మహరాజ్ యూనివర్సిటీ మూడు కోర్సులను ప్రవేశపెట్టింది. ‘కర్మకాండ’పై సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులతో పాటు ‘జ్యోతిష్య విజ్ఞానం’పై మాస్టర్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలను ఆ యూనివర్సిటీ ప్రారంభించింది.
కర్మకాండ ఆచారాలకు సంబం ధించినది. ఇది వేదాలలో కన్పిస్తుంది. చనిపోయిన తల్లి దండ్రులు, ఇతర బంధువుల ఆత్మశాంతి కోసం కర్మకాండలు నిర్వహిస్తారు. ఇవి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరుగుతాయి. కర్మకాండలు జరిపించి నందుకు ప్రతిఫలంగా వారికి దక్షిణ రూపంలో నగదు, ఇతర రకాల దానాలు ఇస్తారు. ప్రారంభంలో ఈ కోర్సులో కేవలం 29 మంది విద్యార్థులు మాత్రమే చేరినప్పటికీ దానికి వచ్చిన ఆదరణ కారణంగా వారి సంఖ్య పెరిగింది. ‘విద్యా సంవత్సరం మధ్యలో ఈ కోర్సులో సీట్ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. రాబోయే సీజన్లలో సీట్ల సంఖ్యను మరింతగా పెంచే విషయంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు’ అని యూనివర్సిటీ మీడియా ఇన్‌ఛార్జ్, అధ్యాపకుడు విశాల్ శర్మ తెలిపారు. తమ తరగతి గది విద్యార్థులతో నిండిపోయిందని, ఈ సబ్జెక్టును చది వేందుకు తామంతా ఎంతో ఉత్సాహం చూపుతున్నామని పునిత్ తివారీ అనే విద్యార్థి చెప్పారు. ఆయన కాన్పూర్‌లో సీసీటీవీ ఔట్‌సోర్సింగ్ వ్యాపారం చేస్తున్నారు. కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులలో ఓబీసీలు, రిటైర్డ్ ఉద్యోగులు సహా వివిధ నేపథ్యాలు కలిగిన వారు ఉన్నారు. అనేక మంది విద్యార్థులు ఉద్యోగం కోసం కాకుండా వ్యక్తిగత ఇష్టంతోనే ఈ కోర్సును చదువుతున్నారని తివారీ తెలిపారు. నూతన విద్యా విధానం-2020లో భాగంగా యూనివర్సిటీలలో హిందూ కోర్సులను ప్రవేశ పట్టారు. ‘పురాతనమైన, శాశ్వతమైన భారతీయ విజ్ఞానా’న్ని ముందుకు తీసికెళ్లే పేరుతో ఈ కోర్సులను ప్రవేశపెట్టామని వర్సిటీల అధికారులు చెబుతున్నారు. సంస్కృత విద్యా పండితుల సహకారంతో ఈ కోర్సులను రూపొదించారు. ప్రార్థనలు, పంచాగ రచనా పద్ధతులు వంటి సబ్జెక్టులను సర్టిఫికెట్ కోర్సులో బోధిస్తారు. పురాతన వైదిక జ్యోతిష్యం, ఆ శాస్త్రానికి సంబంధించిన విజ్ఞానంలో ఆధునిక, శాస్త్రీయ కోణాలను మాస్టర్ డిగ్రీలో అభ్యసించవచ్చు. గోరఖ్‌పూర్-లక్నో యూనివర్సిటీలో కూడా ఇలాంటి కర్మకాండ కోర్సులనే ప్రవేశపెట్టారు. మరికొన్ని విశ్వ విద్యాలయాలు కూడా ఈ తరహా కోర్సులను ప్రారంభించే యోచనలో ఉన్నాయి. అదే విధంగా ఢిల్లీ యూనివర్సిటీ కొత్తగా ‘హిందూ అధ్యయనాలు’ పేరిట ఓ కోర్సును మొదలు పెట్టింది. నూతనంగా ఏర్పాటు చేసిన హిందూ అధ్యయనాల కేంద్రం పరిధిలో దీనిని ప్రారంభించింది. రాబోయే విద్యా సంవత్సరం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ స్థాయి కోర్సులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి కోర్సులనే బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా అందిస్తోంది.