రానా, త్రివిక్రమ్‌ కాంబోలో హిరణ్య కశ్యప

శాండియాగోలో జరుగుతున్న కామిక్‌ కాన్‌ ఈవెంట్‌ వేదికగా హీరో రానా దగ్గుబాటి తన కొత్త చిత్రం ‘హిరణ్యకశ్యప’ని అనౌన్స్‌ చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్‌ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించ బోతున్నామని, ఇందులో రాక్షసరాజు హిరణ్యకశిపునిగా తాను టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నానని తెలిపారు. అలాగే మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రచనలో ఈ చిత్రం తెరకెక్కుతుందని రానా అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి త్రివిక్రమ్‌ మాట్లాడుతూ, ‘ఈ టైమ్‌లెస్‌ లెజెండ్స్‌ కథను ప్రేక్షకులతో పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన కథనాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభ మైంది. ఈ ఎగ్జైట్‌మెంట్‌ని బిగ్‌ స్క్రీన్‌ పైకి తీసుకు రావడం కోసం మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని చెప్పారు.
దేవుడు చూసుకుంటాడు: దర్శకుడు గుణశేఖర్‌
రానాతో ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది. దీనికి కథ కూడా ఆయనే తయారు చేశారు. కారణాలు ఏవైనా ఇప్పుడు త్రివిక్రమ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ‘దేవుడిని ఇతివత్తంగా చేసుకుని మీరు స్టోరీ తయారు చేసినప్పుడు.., ఆ దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని మరిచిపోవద్దు. అనైతిక చర్యలకు ఆ దేవుడు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇస్తాడని తెలుసుకోండి’ అంటూ గుణశేఖర్‌ ట్వీట్‌ చేశారు.