– మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
– పెద్దఎత్తున తరలివచ్చిన హోంగార్డ్లు
– తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
– డీఅర్డీఓ అపోల్లో, ఉస్మానియా మార్చురీ వద్ద ఉద్రిక్తత సందర్శించిన రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – ధూల్ పేట్
వేతనాలు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఇటీవల హైదరాబాద్ గోషామహల్లో కమాండెంట్ కార్యాలయం ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డ్ రవీందర్ డీఅర్డీఓ అపోలో ఆస్పత్రిలో శుక్రవారం మృతిచెందారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలసుకున్న హోంగార్డులు పెద్దఎత్తున అపోలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని ఆస్పత్రి ముందు బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఎంతో మంది హోంగార్డులు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా హోంగార్డులను పర్మినెంట్ చేస్తానన్న కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. రెండు నెలలుగా వేతనాలు లేక ఇంటి అద్దెలు కట్టలేక, ఇతర చిన్న చిన్న సౌకర్యాలు పొందలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని లేని యెడల రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే.. : రేవంత్ రెడ్డి
హోంగార్ల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఒకరి ఆత్మహత్యకు కారణమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద హోంగార్డు మృతదేహాన్ని ఆయన సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2ంగార్డుల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు.
ఉస్మానియా మార్చురీ వద్ద..
హోంగార్డు రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. దాంతో హోంగార్డులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. మృతుడు రవీందర్ భార్య సంధ్యతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. హోంగార్డుల మృతితో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ భార్య సంధ్య మాట్లాడుతూ.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కమాండెంట్ కార్యాలయం ఆవరణలో సీసీ కెమెరా దృశ్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏఎస్ఐ, కానిస్టేబుల్ను ఎందుకు అరెస్టు చేయలేదని, రవీందర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతన్ని హత్య చేశారని కుటుంబీకులు ఆరోపించారు. రవీందర్ ఫోన్ను అన్లాక్ చేశారని, అందులోని డేటా డిలీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు వారితో మాట్లాడి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం ఉప్పుగూడ అరుంధతినగర్కు మృతదేహాన్ని తరలించారు.