ఆశాలకు ఫిక్స్‌డ్‌ వేతనమివ్వాలి

Hopes should be paid fixed salary– ప్రభుత్వం స్పందించకుంటే 25 నుంచి నిరవధిక సమ్మె : తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ)
– కోఠి కమిషనర్‌ కార్యాలయం ఎదుట భారీ ధర్నా
– హైదరాబాద్‌కు వస్తుండగా జిల్లాల్లో ఆశాల అరెస్టులు
నవతెలంగాణ -సుల్తాన్‌బజార్‌
ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌ కోఠి వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అన్ని జిల్లాల నుంచి వేలాదిగా ఆశ వర్కర్లు తరలివచ్చారు. హైదరాబాద్‌కు వస్తున్న ఆశా వర్కర్లను జిల్లాల్లో పలుచోట్ల పోలీసులు అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేశారు. కోఠి కమిషనర్‌ కార్యాలయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుకు సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వీరందరూ రోగులను సర్వే చేయడం, బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, అన్ని రకాల జబ్బులు గుర్తించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను అందిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇన్ని పనులు చేస్తున్న ఆశా వర్కర్లకు రూ. 9,750 పారితోషికం మాత్రమే వస్తోందని, ప్రభుత్వం వేతనం పెంచకపోవడం అన్యాయం అన్నారు. పని భారం పెరిగిందని, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకా శాన్ని అంటుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో
పారితోషకాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం రూ.18 వేలకు వేతనం పెంచి అందించాలని కోరారు. అలాగే ఆశా వర్కర్లకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. హెల్త్‌ కార్డులు, ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఆశాలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని కవోరారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల్లో ఆశ వర్కర్లకు ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. టీ.బీ. లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. 2021 జులై నుంచి డిసెంబర్‌ వరకు ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్‌ అలవెన్స్‌ నెలకు వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్‌ యూనిఫార్మ్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంగళవారం నుంచి ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నీలాదేవి, కోశాధికారి పి.గంగమని, నాయకులు మీనా, సుమారు నాలుగు వేల మంది ఆశ వర్కర్లు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పలువురు ఆశావర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
దీంతో పోలీసుస్టేషన్‌ ఎదుటే ఆశావర్కర్లు నిరసన తెలిపారు. ఆదిభట్లలో ఆశావర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నుంచి చలో హైదరాబాద్‌కు వెళ్తున్న ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తహసీల్దార్‌ కార్యాయాన్ని ముట్టడించారు. కరీంనగర్‌ జిల్లాలో పలువురు ఆశా కార్యకర్తలను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. గన్నేరువరం, చిగురుమామిడి, తిమ్మాపూర్‌ సహా పలు మండలాల్లో ఆశాలను పోలీసులు స్థానిక స్టేషన్లకు తరలించారు.