స్వీట్‌కార్న్‌తో వేడివేడిగా…

Hot with Sweetcorn...స్వీట్‌కార్న్‌… ఒకప్పుడు సీజనల్‌గా మాత్రమే అందుబాటులో ఉండే ఈ కార్న్‌ ఇప్పుడు అన్ని కాలాల్లోనూ లభ్యమవుతోంది. ఇక ఇందులోని పోషకాల విషయానికొస్తే… విటమిన్‌ బి1, బి6, ఇ, లినోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, రిబోఫ్లావిన్‌ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇది మధుమేహం ఉన్న వారికి మంచి ఆహారం. రక్తలేమిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. చిన్న ప్రేవుల తీరును క్రమబద్ధం చేస్తుంది. కొలెస్టరాల్‌ను నియంత్రిస్తుంది. మూత్రపిండాల పని తీరును అభివృద్ధి చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందుకే ఇది బలవర్థకమైన ఆహారం. అందరికీ ఇష్టమైన ఆహారం… సినిమాకి వెళ్తే ఇంటర్వెల్‌ టైమ్‌లో స్వీట్‌ అండ్‌ మసాలా స్వీట్‌కార్న్‌… స్వీట్‌కార్న్‌ సమోసా… రెస్టారెంట్‌కి వెళ్తే ఫుడ్‌ ఆర్డర్‌కి ముందు స్వీట్‌కార్న్‌ సూప్‌.. ఇలా వేడివేడిగా లాగించేయడం మనకు అలవాటే… అయితే స్వీట్‌కార్న్‌తో ఇంకా చాలా రకాల వెరైటీలు చేయవచ్చు.
కర్రీ
కావాల్సిన పదార్థాలు : స్వీట్‌ కార్న్‌- కప్పు, క్యాప్సికం – ఒకటి, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, ఉల్లిపాయలు- రెండు, టమాటలు – రెండు, జీలకర్ర, ధనియాల పొడి- చెంచా చొప్పున, కారం- చెంచా, గరం మసాలా- చెంచా, ఉప్పు – తగినంత, నూనె – పావుకప్పు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, తాజా క్రీం- కొద్దిగా.
తయారు చేసే విధానం : కడాయిలో నూనె వేసి వేడయ్యాక జీలకర్రను వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటాలను అందులో వేయాలి. టమాటాలు పచ్చి వాసన పోయాక, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం తగినంత ఉప్పు వేసి కలపాలి. నిమిషమయ్యాక బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మంట తగ్గించేయాలి. గ్రేవీ ఉడికి, నూనె పైకి వచ్చాక, ఉడికించిన కార్న్‌ వేసి కలపాలి. కూర మొత్తం దగ్గరగా అయ్యే వరకు సన్న మంట మీద ఉడికించి, చివరగా క్రీం, కొత్తిమీర తరుగు వేసి దింపేస్తే సరిపోతుంది. ఈ కూర పూరీ, చపాతీల్లోకి బాగుంటుంది.
బుల్లెట్లు
కావాల్సిన పదార్థాలు : మరీ మెత్తగా కాకుండా ఉడికించిన స్వీట్‌ కార్న్‌- కప్పు, సాధారణ మొక్కజొన్న – అరకప్పు, ఉడికించిన ఆలుగడ్డ – నాలుగు, మొక్కజొన్నపిండి- రెండు చెంచాలు, బ్రెడ్‌ స్లైస్‌లు – మూడు లేదా నాలుగు, వెల్లుల్లి రెబ్బలు- ఐదారు, అల్లం – చిన్నముక్క, పచ్చిమిర్చి – మూడు లేదా నాలుగు, చక్కెర – అరచెంచా, నల్ల ఉప్పు- అరచెంచా, కారం- పావు చెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు – అరకప్పు, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : రెండు రకాల మొక్కజొన్నలను వేర్వేరుగా ఉడికించి, మరీ మెత్తగా కాకుండా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డలు, మొక్కజొన్నల మిశ్రమాన్ని తీసుకుని కలపాలి. మిక్సీ జార్‌లో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా చేసుకుని కార్న్‌ మిశ్రమంలో కలపాలి. తర్వాత నూనె, ఉప్పు, కొత్తిమీరతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. వీటన్నింటినీ బుల్లెట్లు ఆకారంలో చేసుకుని కాగుతున్న నూనెలో వేయాలి. దోరగా వేయించుకుని తీసేస్తే సరి.
కార్న్‌ రైస్‌
కావాల్సిన పదార్థాలు : అన్నం – కప్పు, ఉడికించిన స్వీట్‌కార్న్‌ – ముప్పావు కప్పు, కొబ్బరి తురుము- పావు కప్పు, పచ్చిమిర్చి- రెండు లేదా మూడు, ఎండుమిర్చి – రెండు, శనగపప్పు, మినపప్పు – చెంచా చొప్పున, కరివేపాకు దెబ్బలు – రెండు, మిరియాలపొడి – చెంచా, ఉప్పు- తగినంత, నెయ్యి- రెండు మూడు చెంచాలు.
తయారు చేసే విధానం : కడాయిలో నెయ్యి కరిగించి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కులు, స్వీట్‌కార్న్‌, కరివేపాకు రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. అందులో స్వీట్‌ కార్న్‌ వేసి, కొంచెం ఉడికాక, తగినంత ఉప్పు, తర్వాత అన్నం వేసి బాగా కలపాలి. పదార్థాలన్నీ బాగా కలిశాక మిరియాల పొడి వేసి కలిపి రెండు నిమిషాలాగి దింపేస్తే సరిపోతుంది.
కట్‌లెట్‌
కావాల్సిన పదార్థాలు : ఉడికించిన నూడుల్స్‌ – కప్పు, స్వీట్‌కార్న్‌ – ముప్పావు కప్పు, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి). కొత్తిమీర కట్ట, టమాట కెచప్‌ – మూడు చెంచాలు, ఉల్లికాడల తరుగు – కొద్దిగా, చీజ్‌ తురుము – అరకప్పు, ఉప్పు- తగినంత, మిరియాలపొడి- చెంచా, నూనె – పావు కప్పు, బ్రెడ్‌ పొడి – అరకప్పు.
తయారు చేసే విధానం : ఓ గిన్నెలో నూనె, బ్రెడ్‌పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో కట్‌లెట్ల ఆకారంలో చేసుకోవాలి. ఒక్కో కట్‌లెట్‌ను బ్రెడ్‌ పొడిలో అద్దాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి కట్‌లెట్‌లను ఉంచి రెండు వైపులా నూనె వేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా కెచప్‌ లేదా గ్రీన్‌ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.