ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాల్సిందే పెండింగ్‌లో ఉన్న డబుల్‌ ఇండ్లు పూర్తి చేయాలి

– లేదంటే గుడిసెలు వేసి ఆక్రమిస్తాం :తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య
– వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌లో సాగిన బస్సు యాత్ర
నవతెలంగాణ-పరిగి/ మహబూబ్‌నగర్‌
ప్రభుత్వాల విధానాల వల్ల పేదలకు నిల్వ నీడ కరువైందని, అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పూర్తి చేయాలన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల సాధన కోసం తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర సోమవారం వికారాబాద్‌ జిల్లాలో పర్యటించింది. సంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్‌ మీదుగా పరిగి పట్టణానికి చేరుకుంది. పరిగి పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి లేబర్‌ అడ్డా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు రోజు రోజుకూ అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. ఎంతోమంది నిరుపేదలు సొంత ఇండ్లు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇస్తానని చెప్పి, నేటికీ ఇవ్వలేదన్నారు. ఎర్రజెండా అండగా ఎంతోమంది నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని చెప్పారు. గుడిసెలు వేసుకున్న పేదలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌
ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాల్సిందే చేశారు. ప్రతి ఒక్కరికీ 125 గజాల స్థలం పట్టా ఇవ్వాలని కోరారు. ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. గతంలో పట్టా పొందిన పేదవాళ్లకు ఇండ్ల జాగా సరిహద్దులను నిర్ణయించి భూమిని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్‌ పాలనలో పరిగి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని అన్నారు. పరిగి మండలం రంగాపూర్‌ గ్రామంలో సర్వేనెంబర్‌ 18లో తొమ్మిది ఎకరాల 39 గుంటల ప్రభుత్వ భూమిలో పేదలకు 125 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. పరిగి పట్టణంలో నిర్మించిన 180 డబుల్‌ బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయకపోతే, ప్రజా సంఘాలు పంపిణీ చేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు మల్లు లక్ష్మి, స్కైలాబ్‌బాబు, ఆశయ్య, జగదీష్‌, కోట రమేష్‌, యాత్ర కన్వీనర్‌ ఎ. వెంకటేష్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.మైపాల్‌, రామకృష్ణ, బుస చంద్రయ్య, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, శ్రీను, ఎండీ హబీబ్‌, సత్యయ్య, లక్ష్మి, అనంతమ్మ, సునీత, యాదయ్య, శేఖర్‌, శీను పాల్గొన్నారు. బస్సు యాత్ర పరిగి నుంచి మహబూబ్‌నగర్‌ పట్టణం మీదుగా అమరచింతకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దగ్గర నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా పేదలు సొంత ఇల్లు లేక ఇరుకు గదుల్లో.. అద్దె ఇండ్లల్లో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న మూడు లక్షల సహాయాన్ని ఐదు లక్షలకు పెంచి పేదలందరికీ ఇవ్వాలని కోరారు.