అర్హులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలి

– సొంత జాగా ఉన్నోళ్లకు రూ.15 లక్షలివ్వాలి
– రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.10 లక్షలు భరించాలి : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్‌
– 58 జీవో ప్రకారం పేదల గుడిసెలకు పట్టాలివ్వాలి
– వ్యకాస రౌండ్‌టేబుల్‌లో ఏకగ్రీవ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. సొంత జాగా ఉన్నోళ్లకు ఇంటినిర్మాణం కోసం గృహలక్ష్మి కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.మూడు లక్షలు సరిపోవని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు భరించి రూ.15 లక్షలు ఇవ్వాలని కోరారు. జీవో నెంబర్‌ 58ని వెంటనే అమలు చేసి పేదల గుడిసెలకు పట్టాలివ్వాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 ఏండ్లుగా పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించాయని చెప్పారు. ఎన్నికల సందర్భంగా వాగ్ధానాలివ్వటం, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం షరామామూలుగా జరుగుతున్నదని అన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పేదలు పోరాడితే కొంతమేరకు అమలు చేస్తున్నారని వివరించారు. అయినా 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో పేదలు సొంతింటి కలను నెరవేర్చు కోలేకపోతున్నారని విమర్శించారు. ఇంటిస్థలం లేనివారికి జాగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ న్యాయం చేయాలని కోరారు. గుడిసెలను ఖాళీచేయిస్తే ఈ ప్రభుత్వమే ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ‘జీవోనెంబర్‌ 58 ప్రకారం పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలి. ఆ భూములను క్రమబద్ధీకరించాలి. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా కుటుంబాలకు ఇండ్లు లేని పేదలున్నారు. అందరికీ ఇండ్లస్థలాలు కేటాయించాలి. శుక్రవారం నుంచి ఈనెల 19 వరకు ఇండ్ల స్థలాల కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తాం. ఈనెల 20 నుంచి 31 వరకు కలెక్టర్‌ కార్యాలయాల్లో లబ్దిదారులతో దరఖాస్తులు పెట్టించి ధర్నాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే వచ్చేనెల 10 నుంచి ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతాం.’అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అధ్యక్షత వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాంనాయక్‌, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ నాయక్‌, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, తెలంగాణ వ్యవసాయ మహిళా కూలీల కన్వీనింగ్‌ కమిటీ కన్వీనర్‌ పద్మ మాట్లాడుతూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసిన భూములను ప్రభుత్వం 59 జీవో ద్వారా క్రమబద్ధీకరిస్తున్నదని విమర్శించారు. పేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని 58 జీవో ద్వారా క్రమబద్ధీకరించడం లేదన్నారు. ఇంకోవైపు సొంత జాగా ఉన్నోళ్ల ఇంటి నిర్మాణం కోసం రూ.మూడు లక్షలిస్తే సరిపోవనీ, సిమెంటు, ఇసుక, ఇనుము ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గృహలక్ష్మి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.