కేసీఆర్‌ దోపిడీని ఎంత కాలం భరిద్దాం?

– అమెరికా న్యూజెర్సీలో తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్‌ను భరించా మనీ, ఇంకా ఎంతకాలం భరిద్దామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్‌ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పారు. అమెరికా న్యూజెర్సీలో ఎన్‌ఆర్‌ఐలు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాలు ఎంతో శ్రమించి పోరాటాలు చేశాయన్నారు. వారు త్యాగాలు చేసి రాష్టాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక్క కేసీఆర్‌ కుటుంబమే పదేండ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. అమెరికాలో ఉన్న తెలంగాణ ప్రజలు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. రూ 22 లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణ ప్రజల సగటు జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయి లో అమలు చేయలేదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన అని చెప్పినందుకే బీఆర్‌ఎస్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చారనీ, కానీ కేసీఆర్‌ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా
కేసీఆర్‌ దోపిడీని ఎంత కాలం భరిద్దాం?
పాలన చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కూడా తెలంగాణ ప్రజలు ఆదరించాలని కోరారు.
కోరమండల్‌ రైలు ప్రమాదం పట్ల రేవంత్‌ దిగ్భ్రాంతి
అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిసాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం తనను కలిచి వేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి యుద్ధ ప్రాతిపదికన నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదానికి కారణాలు అన్వేషించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ 20 ఏండ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందన్నారు. రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.