ఎన్ని ప్రయోజనాలో…

ఆలివ్‌ ఆయిల్లో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నూనె గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే అధిక బరువు అదుపులో ఉంచి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అంతేకాదు మన చర్మాన్ని కాపాడుతుంది. అదెలాగో తెలుసుకుందాం.
స్నానం చేసే అరగంట ముందు శరీరానికి ఆలివ్‌ ఆయిల్‌ రాసుకోవాలి. తర్వాత స్నానం చేస్తే చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది. చర్మం పాలిపోకుండా చేసే గుణం ఈ నూనెలో ఉంది.
ఆలివ్‌ నూనెలో కొద్దిగా పంచదార కలిపి చర్మానికి మసాజ్‌ చేస్తే చర్మం మృదుత్వాన్ని పొందుతుంది.
ఆలివ్‌ ఆయిల్‌ చర్మానికే కాదు వెంట్రులకూ మంచిదే. జుట్టు ఎండిపోయినట్టు అనిపిస్తే, గుడ్డు సొనలో కొద్దిగా ఆలివ్‌ నూనె కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు పట్టులా మారుతాయి. మృదుత్వాన్ని పొందుతాయి.
రోజూ వాడే షాంపూ లేదా కండీషనర్‌లో ఆలివ్‌ నూనెను కలిపి వాడినా ఫలితం ఉంటుంది. వెంట్రుకల సమస్యలన్నీ పోతాయి. చుండ్రు సమస్య పరిష్కరించబడుతుంది.
నిమ్మరసం, ఆలివ్‌నూనె కలిపి జుట్టుకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడూ చేస్తే చుండ్రు పోవడమే కాదు వెంట్రుకలు నిగారింపును పొందుతాయి.