– నేటి నుంచి ప్రక్రియ మొదలు
– ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు పూర్తయిన శిక్షణ
– ఆఫ్‌లైన్ కు చెల్లుచీటి.. అంతా ఆన్లైన్లోనే
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లాలో పశుగణన చేపట్టేందుకు జిల్లా పశుసంవర్ధన శాఖ సిద్ధమైంది. గేదెలెన్ని, గొర్రెలెన్ని, కుక్కలెన్ని ఇలా వివిధ రకాల పెంపుడు జంతు వుల వివరాలను పక్కాగా నమోదు చేయనుంది. ఇప్పటికే గణకులు(ఎన్యుమరేటర్లు), సూపర్వైజర్లకు శిక్షణ పూర్తయింది. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31వరకు పశుగణన సాగనుండగా అందుకు సంబంధించిన కార్యాచరణతో పాటు విధి విధానాలు వివరించనున్నారు. యాప్ లోనే వివరాలను నమోదు చేయాల్సి ఉండగా ఎలా నమోదు చేయాలి, దాని వినియోగ తీరుపై అధికారులకు ఇచ్చిన శిక్షణలో వివరించారు.
పశుగణన ఎందుకంటే…
ప్రభుత్వ పథకాల క్రమంలో లబ్దిదారుల గుర్తింపు, ఇతర అవసరాల క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి పశుగణన నిర్వహిస్తోంది. పెంపుడు జీవులన్నీ లెక్కలో నమోదు చేయడం అఖిల భారత పశుగణనలో భాగం. పశువులతో పాటు వాటి యజమానులు, ఆదాయం, విద్యార్హత, కోళ్ల ఫారాల సంఖ్యపైన ఆరా తీయనున్నారు. ఐదేళ్ల కోసారి పశుగణన చేపడుతుండగా వాస్తవానికి 2023లోనే గణన జరగాల్సి ఉండగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల క్రమంలో వాయిదా పడింది. గణకులు ఇంటింటికి వెళ్లి పశువుల సంఖ్య, వాటి స్థితిగతుల గురించి పూర్తి వివరాలు సేకరిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో పశువుల సంరక్షణకు యజమానులు చేపడుతున్న పద్ధతులను కూడా సర్వేలో నమోదు చేయనున్నారు. ఇప్పటివరకు 20సార్లు దేశవ్యాప్తంగా పశువుల గణనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం చేపడుతు న్నది 21వది.
ఆఫ్లైను చెల్లుచీటి..అంతా ఆన్లైన్లోనే
ప్రతిసారీ గణన ఆఫ్‌లైన్ గా సాగేది. ఈ సారి కాగిత రహితంగా వివరాలు సేకరించాలని నిర్ణయించారు. గతంలో ఒక్కో ఇంటికి రూ.6.50 చెల్లించగా పశువులున్న వివరాలను నమోదు చేసినందుకు రూ.7.50 సర్వే సిబ్బందికి చెల్లించారు. ప్రస్తుత గణనకు గ్రామీణ ప్రాంతాలలో సూపర్వైజర్లకు రూ.1.66, ఎన్యుమరేటర్లకు రూ. 9.94, పట్టణ ప్రాంతాలలో సూపర్వైజర్లకు రూ.1.36, ఎన్యుమరేటర్లుకు రూ.8.15 చెల్లించనున్నారు. గణన నమూనా ఫారంలో 71 కాలమ్‌లను యాప్‌లో పొందుపర్చారు. ఆవులు, గేదెలు, కుక్కలు, కుందేళ్లు, ఎద్దులు, దున్నపోతులు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఇలా వివిధ రకాల వాటిని ఆయా కాలమ్‌లలో నమోదుచేయనున్నారు. అలాగే ప్రత్యేక నమూనాను మాన్యువల్ గా పొందుపర్చాల్సి ఉంటుంది. ట్యాబ్ లో నమోదు చేసిన ప్రతిది రాష్ట్రం, దేశస్థాయిలో అనుసంధానమవుతుంది.
జిల్లా గణాంకాలు ఇలా..
– రెవెన్యూ గ్రామ పంచాయతీలు 566,
– మొత్తం నివాసాలు 401728
– సర్వే సిబ్బంది 218
20వ పశుగణన ప్రకారం..
నల్లగొండ జిల్లాలో గొర్రెలు 1115617, మేకలు 344772,గేదెలు 317279, ఆవులు, ఎద్దులు 206585, దేశీకోళ్లు,లేయర్ కోళ్లు కలిపి 4433639,పందులు 7602, కుందేళ్లు 354,పెంపుడు కుక్కలు 11895
218 మంది సిబ్బంది…
ఈ గణనకు సంబంధించి 59 మంది సూపర్వైజర్లు, 159 మంది ఎన్యుమరేటర్లను కేటాయించారు. ఇప్పటికే వారికి శిక్షణ పూర్తయింది.
ప్రజలు సహకరించాలి: డాక్టర్ వి. సదానందం (జిల్లా పశుసంవర్ధన శాఖ అధికారి)
పాలకులు ప్రణాళికలు తయారు చేయడానికి పశుగణన ఉపయోగపడుతుంది. ఆసుపత్రులు, వైద్యులు ఎంతమంది ఉండాలో తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో, దేశంలో పాల ఉత్పత్తి మాంసం ఉత్పత్తి ఎంతో తెలుసుకోవచ్చు. దానిని బట్టి ప్రణాళికలు తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రజలు పశుగననకు పూర్తిగా సహకారం అందించాలి. తమ వద్ద ఉన్న పశువుల సంఖ్యను కరెక్ట్ గా చెప్పాలి.