ఎన్నికల్లో గెలుపూ ఓటమి ఒకేలాగ తీసుకుంటాము, మేము స్థితప్రజ్ఞులము అనొచ్చు పైకి. ఎన్నికలముందు గట్టిగా అరచినోళ్ళు తరువాత సైలెంటైపోవచ్చు. మేము సమయానికి తగినట్టే మాట్లాడాము అయినా ఎందుకిలా అయిందబ్బా అని ఒకరి గడ్డం ఒకరు గీక్కోవచ్చు. అలా గీక్కుంటూ సమయం వృథా చేయొద్దు అనుకొని, అనుకోవడమే కాదు అసలు గడ్డం ఉన్నోళ్ళనందరినీ దూరం పెడదామన్న నిర్ణయం ఈ సమయంలో తీసుకోవచ్చా లేదా అన్నదీ ఆలోచించవలసిన ప్రశ్నే. సమయ సమయానికీ గడ్డం మార్చడమన్నదీ ఓ కళ అని తెలుసుకోవాలి. కళలు అంత తొందరగా ఒంటబట్టవు. వాటికి తగినంత సమయం కేటాయించాలి. ఓసారి టైమెంతయిందో చూసుకోండి వచ్చేది ఒక్క ఆదివారమే.
సినిమాలోనో టీవీలోనో గుర్తు లేదు కాని టైమెంతయిందండి అన్న ప్రశ్నను కూడా నవ్వించే అంశంగా చేసినవారి హాస్య చతురతకు సలాం చేస్తూ దాని గురించి చెబుతాను. రోడ్డు మీద పోతున్న యాదగిరి టైమెంతయిందండి అని ఎదురుపడ్డ నర్సింగ్‌ను అడుగుతాడు. అప్పుడు అందరి చేతుల్లో సెల్లులు లేవన్న విషయం గుర్తు పెట్టుకోండి. నర్సింగ్ వెంటనే ఎందుకయ్యా నన్ను పరేషాన్ చేస్తవ్, నీవడిగినప్పుడు ఒక టైమ యింటుంది, నేను వాచి చూసేటప్పటికి ఇంకో టైముంటుంది, అది నీకు చెప్పేటప్పుడు ఇంకోటి. అయినా ప్రపంచంలో ఏ రెండు గడియారాలూ ఒకే టైం చూపవని పరిశోధనల్లో తేలింది. ఎందరో శాస్త్రవేత్తలు ఎంతో టైం వెచ్చించీ, వేస్ట్ చేసుకొని దీనిపై చెప్పిందే అది. అందుకే ఇంకోసారి ఎవరినీ టైమెంత అని అడగొద్దు. యాదగిరికి సమజైపోయింది తన టైమేమీ బాగోలేదని.
మణికట్టుపై వేలితో కొట్టి సైగ చేస్తేచాలు సమయమెంతో చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది సమయమెంతయింది అని అడిగితే వాచీ చూడకుండానే చెప్పేస్తారు. ఎందుకంటే, ఎలాగంటే కొన్ని నిముషాల ముందే చూసుకొని ఉంటారు. దానికి కొంత చేర్చి చెబుతారంతే. అదీ ఒక పద్ధతి. ఇక కొంతమంది చెడిపోయిన వాచి పెట్టుకొని తమ స్టైల్ కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళను అడిగితే చూడాలి తమాషా. అందుకే వాళ్ళకూ కొన్ని టెక్నిక్కులు ఉంటాయి, మిత్రుని వాచీలోకి అప్పుడప్పుడూ చూస్తుండటం, ఇంకొకరు వేరొకరితో చెప్పినప్పుడు వినడం ఇలా తమ తంటాలేవో తామే పడతారు. వాచీ కొన్న కొత్తలో దాన్ని అందరూ చూడాలన్న ఆశ అందరికీ ఉంటుంది. ఎక్కడ కొన్నావు, ఎంత ఇలా ప్రశ్నలేస్తే ఇంకా ఆనందం. ఇక ఎవరెవరు ఎప్పుడెప్పుడు సమయ మెంతయిందని అడుగుతారా అని ఎదురు చూస్తుంటారు వీళ్ళు. నాకెలా తెలుసంటే స్వీయ అనుభవం!!
ఇక మన సెల్లుల కాలానికొస్తే, ఒక్క చేతి వాచీ మినహా సెల్లు అన్నింటినీ మింగేసింది. అదే కంప్యూటరై పోయింది, ఫోనై పోయింది, ల్యాప్‌టాప్ అయిపో యింది, కెమేరా అయిపోయింది. కొన్ని షరతులకు లోబడి అవి ఉన్నాయనుకున్నా సెల్లుదే ప్రపంచమైపోయింది. సెల్లులో టైము కనిపించినా దాన్ని అందరూ చూడరు, వాచీనే చూస్తారు. దీనికి కారణం వాచీల తయారీదారులు వేసే వ్యాపార ఎత్తుగడలు కావచ్చు, వాచీ ఓ ఆభరణంగా వాడేవారు కావచ్చు, రకరకాల సందర్భాల్లో దాన్ని బహుమతిగా ఇచ్చేలా అలవాటు చేసి ఉండొచ్చు, డార్విన్ చెప్పినట్టు ఆ వాచీ తాను బతకడం కోసం తనను తాను ఎప్పుడూ మార్చుకుంటూ, రకరకాల రంగుల్లో, సైజుల్లో, ధరల్లో దొరుకుతూ ఉండొచ్చు. ఏమైనా పైన చెప్పుకున్న టైం మీద జరిగిన పరిశోధనలాంటిది ఈ వాచీపై కూడా చేయవలసి ఉంది.
కొందరు అసలు సమయానికంటే కాస్త ముందుగా పెట్టుకుంటారు ముఖ్యంగా గోడకు తగిలించిన గడియారాల్లో. వాటిలోని పెట్టే సమయం గురించి కాస్త సమయం వెచ్చిద్దాం. మా కజిన్ మనోజ్ వాళ్ళింటికి ఇంట్లోవాళ్ళు ఏదో ఇచ్చి రమ్మంటే పోయాను. ఉదయం తొమ్మిదిన్నర అయింది, ఆఫీసుకు ఇంకా అర్థగంట సమయం ఉంది. ఆ ఇచ్చేదేదో ఇచ్చేసి వాళ్ళ గడియారం సైడు చూస్తే ఒక్కసారి గుండె ఆగినంత పనైంది. దాంట్లో పదీ పది అయింది సమయం. ఇంతలో సోదరి సుధ అది నలభై నిముషాలు ఫాస్టుగా ఉంటుదన్నయ్యా అంటే ఊపిరి పీల్చుకున్నాను. ఓ పది నిముషాలు ముందు పెట్టుకుంటే పరవాలేదని కూడా తనే చెప్పింది. అప్పుడే మనోజుకు ఓ సలహా ఇచ్చాను. ఇంట్లో ఐదుగురికీ ఐదు గడియారాలు గోడకు వరుసగా పెట్టి, వాటి కింది మనోజ్, సుధ, సరస్వతి, మైత్రి, చిన్ను ఇలా ఎవరికి కావలసిన టైము వాళ్ళకు పెట్టమని, ఆరోది పెట్టి దానికింద ఒరిజనల్ లేదా సరైన టైము అని రాయమనీ చెప్పాను. అందరమూ నవ్వుకున్నాక తనే చెబుతున్నాడు ఎయిర్‌పోర్టుల్లాంటి కొన్నిచోట్ల వివిధ దేశాల సమయం చూపించినట్టుగా ఉంటుందని. మళ్ళీ నవ్వులు.
టీవీ చూస్తూ ఛానల్స్ మారుస్తూ కూచుంటే సమయమే తెలియదు. సినిమా మధ్యలో వ్యాపార ప్రకటనలొస్తాయి. అప్పుడు ఇంకో ఛానల్ పెడితే అక్కడా ప్రకటనలొస్తూ ఉంటాయి. అంటే వీళ్ళంతా కూడబలుక్కొని కొన్నిసార్లు బలుక్కోకుండా కొన్ని సార్లు ఒకరినొకరు ఫాలో అవుతుంటారని తెలిసిపోతుంది. మనం టీవీ చూసి టైం వేస్ట్ చేస్తున్నామనుకుంటాం కానీ అదే సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు. అలా సమయం ప్రకారం వాళ్ళు పోతుంటారు. టైమెంతయిందో, అవుతుందో వాళ్ళకు తెలిసినంత మనకు తెలీదు. సమయపాలన అనుకుంటూ గడియారం ముల్లులను మార్చుకుంటూ ఉంటాము కాని ఆ ముల్లుల కదలికలనే డబ్బురూపంలోకి మార్చుకునే వాళ్ళూ ఉంటారని మన గమనంలో పెట్టుకోవాలి. సమయమంటే డబ్బు, డబ్బంటే సమయం అన్నది మార్కెటింగ్ జనాలు చెప్పే ఓ సూత్రం.
సమయానికి తగూ మాటలాడెనె అని త్యాగయ్యగారు రాసే ఉన్నారు. అలా సమయమెంతయ్యింది అని కాదు, ఆ సమయానికి ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు అన్నది ఎంతో ప్రధానం. ఎన్నికల సమయాన ఆ మాటలు ఒక లాగ, తరువాత ఒకలాగా ఉంటాయన్నది అందరికీ తెలుసు. అది సమయాన్నిబట్టి మారుతూ ఉంటుంది కూడా. ఎన్నికల్లో గెలుపూ ఓటమి ఒకేలాగ తీసుకుంటాము, మేము స్థితప్రజ్ఞులము అనొచ్చు పైకి. ఎన్నికలముందు గట్టిగా అరచినోళ్ళు తరువాత సైలెంటైపోవచ్చు. మేము సమయానికి తగినట్టే మాట్లాడాము అయినా ఎందుకిలా అయిందబ్బా అని ఒకరి గడ్డం ఒకరు గీక్కోవచ్చు. అలా గీక్కుంటూ సమయం వృథా చేయొద్దు అనుకొని, అనుకోవడమే కాదు అసలు గడ్డం ఉన్నోళ్ళనందరినీ దూరం పెడదామన్న నిర్ణయం ఈ సమయంలో తీసుకోవచ్చా లేదా అన్నదీ ఆలోచించవలసిన ప్రశ్నే. సమయ సమయానికీ గడ్డం మార్చడమన్నదీ ఓ కళ అని తెలుసుకోవాలి. కళలు అంత తొందరగా ఒంటబట్టవు. వాటికి తగినంత సమయం కేటాయించాలి. ఓసారి టైమెంతయిందో చూసుకోండి వచ్చేది ఒక్క ఆదివారమే.
– జంధ్యాల రఘుబాబు
9849753298