‘చెరువు రక్షణకు ఎంత సమయం కావాలి?’

'How long does it take to protect the lake?'కల్తీ విత్తనాల కట్టడికి చర్యలేంటి? : హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌

రామంతాపూర్‌ పెద్దచెరువు, ఇతర చెరువుల రక్షణకు తీసుకున్న చర్యలు నివేదించేందుకు ఎంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చెరువుల రక్షణకు కంచె వేసేందుకు, ఎఫ్‌టీఎల్‌ రక్షణకు 2005 నుంచి చర్యలు తీసుకుంటూనే ఉంటారా? అని నిలదీసింది. ఉస్మానియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె ఎల్‌ వ్యాస్‌ వేసిన పిల్‌పై మంగళవారం హైకోర్టులో చీఫ్‌జస్టిస్‌ అలోక్‌ అరధే బెంచ్‌ విచారించింది. ఈ విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఇతర శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల 12న జరిగే విచారణకు కమిషనర్‌ మళ్లీ రావాలనీ, చెరువు రక్షణకు తీసుకున్న చర్యలను వివరించాలని చీఫ్‌ జస్టిస్‌ ఆదేశించారు.
కల్తీ విత్తనాల కట్టడికి చర్యలేంటి? : హైకోర్టు
రాష్ట్రంలో కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారనే పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. కల్తీ విత్తనాల సరఫరా కట్టడికి తీసుకున్న చర్యలు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014-22 కాలంలో కల్తీ విత్తనాలకు సంబంధించి సుమారు వెయ్యి కేసులు నమోదయ్యాయనీ, అధికారుల చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయని పిటిషనర్‌ వాదించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ హౌం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.