– అయినా ఒంటరిగా లేం.. మిత్రులతో కలిసే ఉన్నాం : మహారాష్ట్ర పర్యటనలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాము ప్రతిపక్ష ఇండియా కూటమి వైపు గానీ, అధికార ఎన్డీయే కూటమి వైపుగానీ లేమని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరి వైపూ లేమనీ, ఉండబోమనీ ఆయన స్పష్టం చేశారు. అయినా తాము ఒంటరిగా లేమనీ, మిత్రులతో కలిసే ఉన్నామని తెలిపారు. మంగళవారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన కేసీఆర్… అక్కడి కొల్హాపూర్‌లోగల సాహూ మహారాజ్ సమాధిని సందర్శించారు. పుష్పాంజలి ఘటించి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘నయా ఇండియా అంటే ఏమిటి…?’ అని ప్రశ్నించారు. 50 ఏండ్లపాటు వాళ్లు (కాంగ్రెస్) అధికారంలో ఉన్నా దేశంలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల అన్ని రంగాల్లోనూ మార్పు జరగాలని ఆకాంక్షించారు. తమ పార్టీ ఎన్నికల యుద్ధ గంటను మోగించిందని చెప్పారు. మహారాష్ట్రలో తమ పనిని ప్రారంభించామని తెలిపారు. మొత్తం 14.10 లక్షల మంది పదాధికారులు ఉన్నారనీ, ఇప్పటి వరకూ 50 శాతం పని పూర్తయిందని చెప్పారు. మరో 15 నుంచి 20 రోజుల్లో గ్రామగ్రామాన పూర్తి స్థాయిలో పనిని ప్రారంభిస్తామని వివరించారు. మహారాష్ట్ర అద్భుత వనరులున్న రాష్ట్రమని అన్నారు. అయినా ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు తప్పటం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలి
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ మాతంగి దళిత కవి, దేశం గర్వించదగ్గ ప్రజా కవి అన్నాభావ్ సాఠేకు దేశ పాలకులు సరైన గుర్తింపు ఇవ్వలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అక్కడి వాటేగాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… సాఠేకు భారతరత్న బిరుదును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాతంగి సమాజానికి మహారాష్ట్ర ప్రభుత్వం సరైన ఆదరణ, గుర్తింపు ఇవ్వటం లేదన్నారు. వారికి ఎమ్మెల్యేలుగా, ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో భాగస్వామ్యం కల్పించటం లేదని చెప్పారు. ఆ సమాజానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందజేస్తామని వివరించారు.
సీఎంకు ‘ప్రగతి రథం’ డ్రైవర్ల కృతజ్ఞతలు
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు సీఎం కేసీఆర్ ప్రగతి రథం (ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లినప్పుడు వాడే స్పెషల్ బస్సు) డ్రైవర్లు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీకి చెందిన డ్రైవర్లు శ్రీహరి, వెంకటేశ్, మెకానిక్ నటరాజ్ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.