ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌

I am with CBN– విప్రో సర్కిల్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన
– టీడీపీ శ్రేణుల ఆందోళన, అరెస్ట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బుధవారం హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. భారీగా గుమిగూడారు. జై సీబీఎన్‌ అంటూ నినాదాలు చేశారు. ఐ యామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసుల అనుమతి లేకపోవడంతో ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగులు సైతం వెనక్కి తగ్గకపోవడంతో విప్రోకూడలిలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు..అందుకే జైల్లో పెట్టారు. అక్రమ కేసులు ఎత్తేయాలి..కక్ష సాధించేందుకే బాబుపై కేసులు..ఆయన వల్లే మాకు ఉపాధి అవకాశాలు లభించాయి..మా జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటాం..సైకో పోవాలి..సైకిల్‌ రావాలి..కక్ష సాధింపు రాజకీయాలు అభివృద్ధికి విఘాతం..వచ్చే ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తామని’ అంటూ ఆందోళనలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే నిరసనలో ఐటీ ఉద్యోగులకు సంఘీభావం చెప్పిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, బంటు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. వీరందరిని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.