నా పాత్ర ముగిసింది అనుకున్నాను!

– కారు ప్రమాద ఘటనపై రిషబ్‌ పంత్‌
ముంబయి : 30 డిసెంబర్‌, 2022. భారత క్రికెట్‌ను షాక్‌కు గురి చేసిన రోజు. టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ తీవ్ర కారు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన రోజు అది. కుటుంబంతో గడిపేందుకు న్యూఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో కారు రోడ్డు డివైడర్‌కు ఢకొీని రిషబ్‌ పంత్‌ దారుణంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు రిషబ్‌ పంత్‌ను కారు నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. పంత్‌ బయట పడని కాసేపట్లోనే అతడి ఎస్‌యూవీ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మరణం అంచు వరకు వెళ్లి వచ్చిన రిషబ్‌ పంత్‌ ఓ టెలివిజన్‌ ఛానల్‌తో కారు ప్రమాదంపై మనోభావాలను పంచుకున్నాడు. ‘ ఈ ప్రపంచంలో నా సమయం అయిపోయింది’ అని అనిపించిందని పంత్‌ భావోద్వేగంగా అన్నాడు. ‘జీవితంలో తొలిసారి అంతా అయిపోయింది.. పోనీలే అనిపించింది. ఈ ప్రపంచంలో నా సమయం ముగిసిందని అనిపించింది. గతంలో ఎన్నడూ అటువంటి భావన నాలో కలుగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో నాకు తగిలిన గాయాలు గుర్తున్నాయి. కానీ మరింత ప్రమాదకర గాయాలు కాకుండా బయటపడటం నా అదృష్టం. కుడి కాలు మోకాలుకు మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌ కొనసాగించాను. రికవరీ సమయాన్ని కుదించేందుకు శ్రమించాను. గాయం నుంచి కోలుకునే ప్రక్రియ చాలా చిరాగ్గా ఉంటుంది. ప్రతి రోజు చేసిందే మళ్లీ చేయాలి. అది అసహనం కలుగజేస్తుంది. అయినా, చేయక తప్పదు. మళ్లీ క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టే వరకు ఎటువంటి భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకోవాలని అనుకోవటం లేదు. నేను కోలుకునే సమయంపై ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. నేను నా డాక్టర్‌ను నేరుగా ఆడిగాను. కనీసం 16-18 నెలలు సమయం పడుతుందని ఆయన చెప్పారు. అందులో కనీసం ఆరు నెలలు ముందుగానే పూర్తిగా కోలుకుంటానని డాక్టర్‌తో చెప్పాను. ప్రమాదం జరిగిన సమయంలో రజత్‌ కుమార్‌, నిషు కుమార్‌లు నన్ను కారు నుంచి బయటకు లాగారు. ఆ ఇద్దరిని జీవితాంతం రుణపడి ఉంటాను’ అని రిషబ్‌ పంత్‌ అన్నాడు. బెంగళూర్‌లో ఆగస్టు 24, 2023న రిషబ్‌ పంత్‌ ఇంటర్వ్యూ తీసుకోగా.. సదరు ప్రసారదారు ఫిబ్రవరి 1న ప్రసారం చేశారు.