మరే పార్టీలోనూ చేరను : ఈటల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తాను బీజేపీ నుంచి మారుతానని కొందరు భావిస్తున్నారనీ, పార్టీ మారే ప్రసక్తే లేదని బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నొక్కి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాజకీయ నాయకుడైనా హమీలు ఇచ్చాడంటే అమలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయని విమర్శించారు. పేదలకు పది లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ. 3, 016 చొప్పున నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. రైతుల డిక్లరేషన్‌, యువత డిక్లరేషన్‌, ఉమెన్‌ డిక్లరేషన్‌ అంటూ కొందరు ఊదరగొడుతున్నారని విమర్శించారు. రింగురోడ్డు, కోకాపేట భూమల అమ్మకం, మద్యం దుకాణాల టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయంతో రైతుల రుణమాఫీ చేస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మెన్‌ తుల ఉమా, అశ్వద్ధామ రెడ్డి, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.