పిచ్చోళ్ల విమర్శలకు స్పందించను..

– వాళ్లంతా ఎన్నికలప్పుడే వస్తారు.. తరువాత మాయం అవుతారు..
– నన్ను తిడితే టిక్కెట్‌ వస్తుందనే ఆశలో కొందరు ప్రతిపక్ష నాయకులు
– ప్రతి ఎన్నికల్లోనూ నాపై వక్ఫ్‌భూముల కబ్జా నిందారోపణలు
– వాళ్లకు లీగల్‌నోటీసులు ఇచ్చా.. త్వరలో చర్యలు తప్పవు
– రాష్ట్రంలో 90సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తాం
– ఉమ్మడి జిల్లాలోని 13నియోజకవర్గాలనూ క్లీన్‌స్వీప్‌ చేస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘నన్ను తిట్టి.. నాపై నిందారోపణలు చేసి ఉనికి చాటుకునే పిచ్చోళ్ల మాటలకు నేను స్పందించను. వాళ్లంతా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వచ్చి అరవడమే తప్ప.. ఎన్నికలయ్యాక మళ్లీ కనిపించకుండా పోతారు. ఇలాగే ప్రతి ఎన్నికల్లోనూ నాపై వక్ఫ్‌భూముల కబ్జా చేశారని నోటికి ఎంతవస్తే అంతా మాట్లాడుతున్నారు. నేను ఒక వందల సార్లు, వంద వేదికలపై వివరణ ఇచ్చాను. దేవుని సొమ్ము తింటే పాపం ఊరికే పోదు’ అని రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలే పట్టంగడుతారని, 90కిపైగా సీట్లు గెలిచి మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోనూ 13నియోజకవర్గాలన్నింటినీ క్లీన్‌ స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడారు. త్వరలోనే ఎవరూ ఊహించని విధంగా తమ పార్టీకిలో కీలకనేతల చేరికలు ఉంటాయని చెప్పారు.
రాజకీయం, పాలనా అనుభవం లేని కొంతమంది అజ్ఞానులు చేసే విమర్శలకు తాను స్పందించబోమనని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వచ్చి పిచ్చిమాటలు మాట్లాడేవాళ్లంతా.. ఎన్నికలయ్యాక మళ్లీ కనుమరుగవుతారని అన్నారు. ఇలాంటి వారి పట్ల కరీంనగర్‌ ప్రజలు తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. నమ్మి వారికి అధికారమిస్తే దోచుకునేందుకు కాచుకుని ఉన్నారని అన్నారు. గతంలో వారి హయాంలో లక్ష రూపాయల రోడ్డు మంజూరుచేసి అందులో రూ.60వేలు మింగి.. మిగిలిన రూ.30వేలతోనే రోడ్డు వేసేవారని విమర్శించారు. అలాంటి వారికి గనుక అధికారం ఇస్తే కరీంనగర్‌లోని కేబుల్‌ బ్రిడ్జి స్టీల్‌ తీగలను అమ్ముకునేరకమని అన్నారు. సురక్షితంగా ఉన్న నగరంలో అశాంతి కోసం ప్రయత్నిస్తోన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ‘కొందరు నన్ను తిట్టి, వాళ్ల పార్టీలో పాపులారిటీ పొందాలి’ అని భావిస్తున్నారన్నారు. వక్ఫ్‌ బోర్డు భూములపై ప్రతి ఎన్నికల సమయంలోనూ తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎమ్మెల్యే కాకముందే 2008లోనే అన్ని రికార్డులూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే భూములు కొనుగోలు చేశానన్నారు. ఆ ప్రాంతంలో మైనార్టీ ఇల్లుగానీ, చిన్న దర్గాగానీ లేదన్నారు. రైతుల నుంచి పక్కా పత్రాలతో కొనుగోలు చేసిన భూములపై అనవసర ఆరోపణలు చేస్తున్నవారికి ఇప్పటికే కోర్టు నోటీసులు పంపానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నోరు ఉందికదా.. అని ఇష్టమొచ్చినట్టు నిందారోపణలు చేస్తే ‘చిరంజీవి విషయంలో జీవిత-రాజశేఖర్‌కు పడ్డ శిక్ష’నే పడుతుందని హెచ్చరించారు. వారిపై పరువు నష్టం సహా ఇతర శిక్షలు తప్పవని సూచించారు.
ఆగస్టు 16 నుంచి వెల్ఫేర్‌, అభివృద్ధి పనులు
ఈనెల 16 నుంచి నియోజకవర్గంలో వెల్ఫేర్‌, అభివృద్ధి పనులను వేగిరం చేస్తామన్నారు. రెన్నెళ్లకు కలిపి నియోజకవర్గంలోని 600 మంది కులవృత్తి లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు అందిస్తామన్నారు. మైనార్టీలకు కుట్టుమిషన్లు, ఇతర ఉపాధి సాయాన్ని అందిస్తామన్నారు. మరోవైపు నగరంలో రూ.125కోట్లతో మిగిలిన పోయిన మెయిన్‌రోడ్డు పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. వీటితోపాటు మరో రూ.25కోట్లు బఫర్‌ నిధి కింద వేరు చేశామని, ఎవరు తమ ఇంటి ముందు సీసీ రోడ్డు కావాలని అడిగినా వెంటనే అక్కడ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలకు ఏ సబ్జక్టూ లేక గహలక్ష్మి లాంటి స్కీంపై బురదజల్లుతూ రాజకీయం చేస్తున్నారని, ఈ పథకం నిరంతర ప్రక్రియగా ఉంటుందని ఇదివరకే ప్రకటించామని చెప్పిన విషయాన్ని పునరుద్ఘాటించారు.