ఐసీడీఎస్‌ మంత్రి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి

– లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం: పి.జయలక్ష్మి, ఎన్‌.కరుణకుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంగన్‌వాడీ సమ్మెను ఉద్దేశించి రాష్ట్ర ఐసీడీఎస్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి (సీఐటీయూ) ఎన్‌.కరుణకుమారి (ఏఐటీయూసీ) తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలనీ, సమ్మెలో ఉన్న సంఘాలతో చర్చలు జరపాలని వారు కోరారు. లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఒక ప్రకటనలో హెచ్చరించారు. అంగన్‌ వాడీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించామంటూ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 18న అదే మంత్రి చర్చలు జరిపి నిర్దిష్టంగా కొన్ని అంశాలపై హామీలను ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని కప్పిపుచ్చి అంగన్‌వాడీ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన సమ్మెపై దాడి చేయడం సరికాదని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఆ అంశాన్ని పక్కన పెట్టి కేంద్రం చుట్టూ తిప్పాలని చూడటం సరైంది కాదని పేర్కొన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా అనేక రాష్ట్రాలు వారికి పలు సౌకర్యాలు అందిస్తున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడే మంత్రి తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని అంగన్‌ వాడీ పర్మినెంట్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రిటైర్‌ మెంట్‌ బెనిఫిట్లను రూ.4 లక్షలు ఇస్తున్న అస్సోం గురించి, రూ.3 లక్షలు ఇస్తున్న బెంగాల్‌ గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. సంక్షేమబోర్డుతో పాటు పెన్షన్‌ ఇస్తున్న కేరళ గురించి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తున్న కర్ణాటక గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. అనేక రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాలను తక్కువగా చేసి చూపిస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడటం సరికాదని విమర్శించారు. 2018లో కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచితే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏమి పెంచలేదని చెప్పడం మంత్రి హౌదాలో సరైంది కాదని వారు విమర్శించారు.