ఆదర్శంగా క్రీడా పాలసీ

Ideally sports policy– క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ , శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
– అట్టహాసంగా చలో మైదాన్‌
హైదరాబాద్‌ : దేశానికి ఆదర్శంగా నిలిచేలా, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేలా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన క్రీడా విధానాన్ని తీసుకు రానుందని క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. హాకీ మాంత్రికుడు, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎల్బీ స్టేడియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) నిర్వహించిన ‘చలో మైదాన్‌’ ముగింపు కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నష్టపోయాం. స్వరాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఓ స్టేడియం నిర్మించుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 18 వేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన సమగ్ర స్పోర్ట్స్‌ కిట్‌ను సైతం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌లకు ఇంటి స్థలాలు, భారీ నగదు బహుమతి అందించాం. త్వరలోనే దేశానికి ఆదర్శంగా నిలిచేలా నూతన క్రీడా విధానాన్ని ప్రకటించబోతున్నామని’ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల కేంద్రాల్లో చలో మైదాన్‌ కార్యక్రమంలో భాగంగా క్రీడా యువ సమ్మేళనాలు, యువ చైతన్య సభలకు సుమారు లక్ష మంది యువత హాజరవటం గొప్ప విషయం. యువత క్రీడలను ఓ కెరీర్‌గా ఎంచుకునేందుకు చైతన్యదీపకిగా ఉండేలనే లక్ష్యంతో చలో మైదాన్‌ కార్యక్రమం నిర్వహించాం. తెలంగాణ క్రీడాకారుల విజయ గాథలను డాక్యుమెంటరీ రూపంలో యువతకు ప్రదర్శించాం. క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్‌లో మన క్రీడాకారులు ఒలింపిక్స్‌లోనూ పతకాల పండించేందుకు అనువైన క్రీడా వాతావరణం కల్పించేందుకు కషి చేస్తున్నామని’ అన్నారు. ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన చలో మైదాన్‌ ముగింపు కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి జగదీశ్‌ యాదవ్‌, గీత కార్పోరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవి కుమార్‌ గౌడ్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వైస్‌ చైర్మెన్‌ మల్కా కొమురయ్య సహా క్రీడా సంఘాల ప్రతినిధులు, పారా ఒలింపియన్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
వేడుకగా క్రీడా దినోత్సవం
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగింది. చలో మైదాన్‌లో భాగంగా 33 జిల్లాల కేంద్రాల్లో యువ చైతన్య సభలు నిర్వహించారు. యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. ‘గత ఆరు నెలల్లోనే రాష్ట్ర స్థాయి మహిళల చెస్‌ టోర్నీ, సీఎం కప్‌, ట్రైక్రీడా వేడుకలు సహా ఇప్పుడు చలో మైదాన్‌తో శాట్స్‌ యంత్రాంగం క్రీడాభివృద్ధిలో నిమగమైంది. పల్లెల నుంచి ప్రపంచ చాంపియన్లు రావాలనే నినాదంతో రానున్న కాలంలో మరిన్ని క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని’ శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు.