రాజీ కుదిరితే బెయిలిస్తారా?

– గుజరాత్‌ హైకోర్టును తప్పుపట్టిన సుప్రీం
– రాష్ట్ర ప్రభుత్వ తీరు పైనా విమర్శలు
న్యూఢిల్లీ: ‘వ్యక్తిగత రాజీ’ కుదిరిందన్న సాకుతో హత్య కేసులో నిందితుడైన వ్యక్తికి గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను కొట్టి వేస్తూ వెంటనే లొంగిపోవాల్సిందిగా నిందితుడిని ఆదేశించింది. బెయిల్‌ ఆదేశాలను ఎందుకు సవాలు చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా మండిపడింది. కేసులోని వివరాలలోకి వెళితే… మృతుని కుమారుడితో రాజీ కుదిరిందని నిందితుడు కోర్టుకు తెలియజేశాడు. నిందితుడితో ఒప్పందం కుదిరిందని ఫిర్యాదుదారైన మృతుని కుమారుడు కూడా అఫిడవిట్‌ దాఖలు చేశాడు. వీటి ఆధారంగా గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుడు జరిపిన దాడిలో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. నిందితుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గాయపడిన వ్యక్తి సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. కాగా నిందితుడికి నేర చరిత్ర ఏమీ లేదంటూ హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులలో పేర్కొనడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఎందుకు సవాలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాను జారీ చేసిన తాజా ఆదేశాలను రాష్ట్ర హోం కార్యదర్శికి పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.