కుల గణనను అడ్డుకుంటే…

కేంద్రం అగ్నిపర్వతాన్ని ఎదుర్కోవాల్సిందే : బీహార్‌
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలన్న బీహార్‌ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో కేంద్రం గంటల వ్యవధిలోనే రెండు అఫిడవిట్లు దాఖలు చేయడంపై జేడీయూ, దాని మిత్రపక్షం ఆర్జేడీలు ధ్వజమెత్తాయి. బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందనీ, దాని లక్ష్యం సర్వేను అడ్డుకోవడమేనని ఆగ్రహం వ్యక్తంచేశాయి. కులగణనను అడ్డుకుంటే బీజేపీ అగ్ని పర్వతాన్ని ఎదుర్కోవలసివస్తుందని హెచ్చరించాయి.
‘జనగణన లేదా జనగణనకు సమాన చర్య’ ఏదైనా కేంద్రం మాత్రమే చేపట్టాలని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కొన్ని గంటల్లోనే మొదటి అఫిడవిట్‌లో ఈ వ్యాఖ్యను కొట్టివేస్తూ మరో అఫిడవిట్‌ సమర్పించింది. మొదటి దానిలో ‘అనుకోని తప్పిదం’ జరిగిందంటూ.. ఆ పేరాగ్రాఫ్‌ అనుకోకుండా వచ్చిందని పేర్కొంది. ఈ అఫిడవిట్‌లపై జేడీయూ, దాని మిత్ర పక్షం ఆర్జేడీ విమర్శలు గుప్పించాయి.
ప్రధాని కార్యాలయం కులగణనను అడ్డుకునేందుకు పుస్తకంలోని ప్రతి ట్రిక్కును ప్రయత్నిస్తోందని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్‌ ఝా మండిపడ్డారు. ప్రజల హక్కులను అడ్డుకునేందుకు బీజేపీ, సంఫ్‌ు పరివార్‌లు సర్వాధికారాలను ఒడ్డుతున్నాయనడాన్ని ఈ చర్య నిరూపిస్తోందని అన్నారు. వరుసగా అఫిడవిట్‌లపై స్పందిస్తూ.. ఇది అనుకోకుండా జరిగినది కాదని, బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.. ఈ వర్గం హక్కులను అడ్డుకోవాలని చూస్తే.. అగ్ని పర్వతాన్ని సష్టించినట్టే” అని హెచ్చరించారు. తాము జనగణన కాదని, సర్వే చేపడుతున్నామని బీహార్‌ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోందని .. కానీ కేంద్రం హాస్యాస్పదంగా వ్యవహరిస్తోందని జెడియు నేత, బీహార్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజరుకుమార్‌ చౌదరి వ్యాఖ్యానించారు. బీహార్‌లో అఖిల పక్ష సమావేశంలో సర్వేకు బిజెపి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అడ్డుపడుతోందని .. దీంతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని అన్నారు.