భూమిలేదని బుకాయిస్తే..

మీ ఆక్రమిత భూముల లెక్కలు తీస్తాం
పేదల జోలికొస్తే ఖబడ్దార్‌
ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
 భూపోరాట కేంద్రాలు సందర్శించి భరోసానివ్వాలి
24న ప్రజాసంఘాల పోరాట వేదిక బస్సు యాత్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో పేదలకు పంచేందుకు ప్రభుత్వ భూములు లేవని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ బుకాయిస్తే.. అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్న భూములు లెక్కలు బయటకు తీస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 70 కేంద్రాల్లో భూపోరాటాలు జరుగుతున్నాయని, ఈ పేదలకు నివాసస్థలాలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పుట్టగతులుండవని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు పేదలపై చిత్తశుద్ధి ఉంటే భూపోరాట కేంద్రాలను సందర్శించి భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇండ్ల స్థలాల కోసం పేదలు చేసే పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని, అవసరమైతే పేదల కోసం ప్రాణాలు త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. ఇండ్లస్థలాల కోసం జరిపే ఈ పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు కులమతాలను జొప్పించి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారని, అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో ఐక్యత వీడొద్దని చెప్పారు.
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో 28 రోజులుగా సుమారు 500 మంది పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ భూపోరాట కేంద్రాన్ని శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొర్రపాటి రమేష్‌, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నా నేటికీ పేదోడు తలదాచుకునేందుకు జాగా లేదని, దేశంలో పార్టీలు, జెండాలు మారుతున్నా పేదల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు లేవని చెబుతున్న నేతలు.. తమతో వస్తే స్థలాలు చూపిస్తామని అన్నారు. ‘కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గణేష్‌ ప్రభుత్వ స్థలాలు లేవని అంటున్నారని, ఇక్కడికి(దుబ్బ) వస్తే తాము చూపిస్తామని, తాము ప్రభుత్వ స్థలంలో నిల్చొనే మాట్లాడుతున్నామని స్పష్టంచేశారు. ప్రభుత్వ స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు మింగేస్తున్నా.. వారిని వదిలేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు.. పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నగరంలో ఇప్పటికే సుందరయ్యనగర్‌, దొడ్డికొమరయ్య కాలనీ, బహుజన కాలనీ నిర్మించామని, తెలంగాణలో పేదలకు భూములు పంచిన ఘనత సీపీఐ(ఎం)కే దక్కుతుందన్నారు. ఎంత అణిచివేసినా, అధికార బలం చూపినా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక కేంద్రంలోని మోడీ సర్కారు 2024 వరకు అందరికీ ఇండ్లు కట్టిస్తామని వాగ్ధానం చేసి విస్మరించారని వాపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీఎం ఆవాస్‌ యోజన అన్నారని, నిజామాబాద్‌లో ఎవరికైనా ఇండ్లు వచ్చాయా అని ప్రజలను ప్రశ్నించారు. దానికి అందరూ రాలేదని సమాధానం ఇచ్చారు. ఇక కేసీఆర్‌ కొత్తగా గృహలక్ష్మి పథకం అంటున్నారని, ఇండ్లు ఉన్నవారికి రూ.3లక్షలు ప్రకటించారని గుర్తు చేశారు. ‘మూడు లక్షలతో ఇండ్ల నిర్మాణం పూర్తయితదా.. మీ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులు మూడు లక్షలతోనే కట్టారా.. అని ప్రశ్నించారు. గృహలక్ష్మిలో స్థలం ఉన్న పేదలకు కేంద్రం రూ.5 లక్షలు, రాష్ట్రం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలం ఇవ్వాలని, ఒకవేళ ప్రభుత్వ భూములు లేకుంటే ప్రయివేటు వ్యక్తుల నుంచి భూమి కొని పంచాలని డిమాండ్‌ చేశారు. ఇక భూపోరాట కేంద్రాల్లోని పేదలకు మద్దతుగా ఈ నెల 17వ తేదీ నుంచి ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నామని, 24వ తేదీన జిల్లాలో జరిగే జాతాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, జిల్లా నాయకులు నూర్జహాన్‌, గోవర్ధన్‌, సూరి, సుజాత, రాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.