మణిపూర్‌ మండుతుంటే..

If Manipur is burning..– ఇజ్రాయిల్‌ వైపు మోడీ చూపు
–  రాహుల్‌ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : ఓవైపు మణిపూర్‌ మండుతుంటే ప్రధాని మోడీ మాత్రం ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధం పట్ల అధిక ఆసక్తి కనబరుస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ మాట్లాడుతూ మణిపూర్‌ హింసాకాండను విస్మరించి ఇజ్రాయిల్‌లో ఏం జరుగుతుందనే దానిపై ప్రధాని, భారత ప్రభుత్వం ఆసక్తి చూపుతుండటం తనకు విస్మయం కలిగిస్తోందని అన్నారు.
ఈ ఏడాది జూన్‌లో తాను మణిపూర్‌ సందర్శించిన ప్పుడు అక్కడ చూసిన విషయాలను నమ్మలేకపోయానని చెప్పారు. మణిపూర్‌ను బీజేపీ నాశనం చేసిందని, ఇప్పుడది ఓ రాష్ట్రం కాదని, రెండు రాష్ట్రాలని మైతీ, కుకి వర్గాల మధ్య ఘర్షణలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్నారు..మహిళలను లైంగిక వేధింపులకు గురిచేశారు..చిన్నారులను చిదిమేశారని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత జరిగినా మణిపూర్‌ను సందర్శించడం ముఖ్యమనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తించలేదని అన్నారు. మేలో మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లినప్పటి నుంచి ఇంతవరకూ ప్రధాని మోదీ ఆ రాష్ట్రాన్ని ఇప్పటివరకూ సందర్శించకపోవడం సిగ్గుచేటని రాహుల్‌ చెప్పారు.