మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్‌

If media freedom is taken away, Khabaddar– పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు
– జర్నలిస్టుల నిరసన ర్యాలీలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాలకులు మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్‌ అంటూ పలువురు వక్తలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలాంటి చర్యలకు పాప్పడటమంటే అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో న్యూస్‌క్లిక్‌, వైర్‌ తదితర మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబర్దార్‌, ఢిల్లీ పోలీసుల వైఖరిని ఖండించండి, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుదాం, రాజ్యాంగ హక్కులను గౌరవిద్దాం అంటూ ఈ సందర్భంగా జర్నలిస్టులు నినదించారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌), ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(ఐఎఫ్‌డబ్ల్యూజే), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(హెచ్‌యూజే), తెలంగాణ బ్రాడ్‌ కాస్ట్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (టీబీజేఏ)ల నేతృత్వంలో పాత్రికేయులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగాటీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన సభలో సీనియర్‌ పాత్రికేయులు తెలకపల్లి రవి, ప్రజాశక్తి మాజీ ఎడిటర్‌ ఎస్‌. వినరు కుమార్‌, ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, అఖిలభారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్ధసారధి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌ తదితరులతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. తెలకపల్లి రవి మాట్లాడుతూ న్యూస్‌ క్లిక్‌పై రుజువుకు నిలవని, నిరాధారమైన ఆరోపణలు చేసి వారిని అకారణంగా అరెస్టు చేశారని విమర్శించారు.మీడియా అనేది మోడియాగా మారి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతున్న ప్రస్తుత తరుణంలో న్యూస్‌క్లిక్‌పై జరిగిన దాడిని అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు రోజురోజుకు హరించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయ, అమిత్‌ చక్రవర్తిలను ఎందుకు అరెస్టు చేశారో స్పష్టత ఇవ్వాలన్నారు. కనీసం వారికి ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాసినా, మాట్లాడినా ఏదో ఒక నెపంతో అరెస్టులు, కేసులు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని గుర్తు చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా జర్నలిస్టులు తమ గళానికి, కలానికి పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మీడియా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపడం సహించారనిదన్నారు. న్యూస్‌ క్లిక్‌ పోర్టల్‌ కార్యాలయంపైన, అందులో పని చేస్తున్న 47 మంది జర్నలిస్టులపైన ఢిల్లీ పోలీసులు దాడులు జరిపిన తీరు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు సోదాలు జరుపుతున్నారో, ఎందుకు అరెస్టులు చేస్తున్నారో చెప్పకుండా చీకటి రోజులను గుర్తు చేసే విధంగా ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు ఇస్తున్నారనే కక్షతో మీడియా సంస్థలను బెదిరించి తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్న పోలీసులు ముందుగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయడం లేదో చెప్పడం లేదని తెలిపారు. చైనా పెట్టుబడులను బూచిగా చూపి ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారని విమర్శించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనన్నారు. మీడియా సంస్థపైన, జర్నలిస్టుల పైన పాలకులు చేస్తున్న దాడులను ఆపకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. వినరుకుమార్‌ మాట్లాడుతూ 2021 నుంచి ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలను ఉపయోగించి వరుస చర్యలతో న్యూస్‌క్లిక్‌ను లక్ష్యంగా ఎంచుకున్నారని తెలిపారు. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని విమర్శించారు. ప్థాసారధి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అప్రజాస్వామికంగా ఉందని చెప్పారు. సాగర్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై తప్పుడు ప్రచారం చేయటం కేంద్రానికి అలవాటుగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శులు ఈ. చంద్రశేఖర్‌, తన్నీరు శ్రీనివాస్‌, హెచ్‌ యూజే అధ్యక్ష కార్యదర్శులు అరుణ్‌ కుమార్‌, జగదీష్‌, ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు నవీన్‌, రాజశేఖర్‌, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.