పాత పెన్షన్‌ ఇవ్వకుంటే..ఓట్లూ ఇవ్వొద్దు

If old pension is not given..don't give votes– జాతీయ స్థాయి అందోళనల్లో భాగస్వాములు కండి
– భారత్‌బంద్‌కు సిద్ధమవ్వండి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐఆర్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్రా పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేయకుంటే, వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ బీజేపీకి ఓట్లు వేసేది లేదని తెగేసి చెప్పాలని ఆలిండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌ఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్రా పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు తమతో పాటు, తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కూడా బీజేపీకి ఓట్లు వేయోద్దని ప్రచారం చేయాలని చెప్పారు. ఇందిరాగాంధీ వంటి మహానేతనే ఓడించిన ఘనత రైల్వే ఉద్యోగులదని అన్నారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్సీఆర్‌ఎమ్‌యూ) ఆధ్వర్యాన మంగళవారంనాడిక్కడి రైల్‌ కళారంగ్‌లో ‘జాతీయ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి’ అనే అంశంపై జరిగిన జోనల్‌ స్థాయి సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పాత పెన్షన్‌ విధానాన్ని సాధించుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఐక్యం కావాలనీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో భాగస్వాములు కావాలని చెప్పారు. జాతీయ స్థాయిలో ఆందోళనలు తీవ్రం అవుతున్నాయనీ, సమీప భవిష్యత్‌లో ‘భారత్‌బంద్‌’ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ముతో ప్రధాని మోడీ తన స్నేహితుల జేబులు నింపుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల ఖాతాల్లోకి రూ.10వేలు వేస్తే, పెరుగుతున్న ధరల్ని ప్రజలు పట్టించుకోరని మోడీ సర్కారు భావిస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే, పాత పెన్షన్‌ సాధన కష్టతరమేం కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) అధ్యక్షులు కే జంగయ్య మాట్లాడుతూ ఉద్యోగుల డబ్బును ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమించి, వాటి అమలు కోసం మళ్లీ ఆందోళనలు చేయాల్సి వస్తున్నదన్నారు. పోరాడి సాధించుకున్న హక్కుల్ని కేంద్రప్రభుత్వం కాలరాస్తున్నదనీ, దీన్ని ఐక్య ఉద్యమాలతోనే ఎదుర్కోగలమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను నియమించరాదనే ప్రపంచబ్యాంకు షరతుల్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదనీ, ఒకవేళ నియామకాలు చేపడితే తక్కువ వేతనాలు, పెన్షన్‌ వంటి సౌకర్యాలకు కోతలు పెడుతున్నదనీ అన్నారు. దానిలో భాగంగానే అవర్‌ బేస్డ్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వంటి పేర్లు పుట్టుకొచ్చాయని వివరించారు. పాత పెన్షన్‌ సాధన కోసం జాతీయ స్థాయిలో జరిగే పోరాటాలకు తమ సంఘం పూర్తి సంఘీభావం తెలుపుతుందన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ప్రధాన కార్యదర్శి ఏ అజీజ్‌ మాట్లాడుతూ పాత పెన్షన్‌ సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నామనీ, ఇక అమీతుమీ తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యతతో డిమాండ్‌ సాధన సాధ్యమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్సీఆర్‌ఎమ్‌యూ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రైల్వేల ప్రయివేటీకరణను వ్యతిరేకించా లన్నారు. కార్యక్రమానికి ఎస్సీఆర్‌ఎమ్‌యూ అధ్యక్షులు కే శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి రైల్వే ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.