సామెతలు గమ్మత్తి వుంటయి. పెద్ద విషయాన్ని రెండు వాక్యాల్లో తేల్చేస్తారు. సమాజంలో ఒగలు సమస్యలు, అవస్తల్లో వుంటే అయ్యో అనేది పోయి అందులోనుంచి తన అవసరం తీర్చుకునేవారు కొందరు వుంటరు. వారిని చూసే ‘ఇల్లు కాలి ఒగడు ఏడుస్తుంటే, సుట్టకు అగ్గి దొరికిందని ఒగడు అనుకున్నడట’ ఈ సామెత పుట్టింది. పూర్వకాలంలో చుట్టలు తాగేవారు. అప్పుడు అగ్గిపెట్టెలు లేని కాలం అయితే ఇల్లుకు నిప్పు అంటుకుంటే నాకు అగ్గి దొరికింది అనుకునే రకం గురించి ఈ వాఖ్యానం. అట్లనే ఇంటికి అల్లుడు అంటే అందరికి ప్రేమనే వుంటది. కానీ ఇచ్చంత్రాలు చేసే అల్లున్ని చూసి ”అల్పెపు అల్లుడు ఇంటికి చేటు కొమ్ముల బర్రె కొట్టానికి చేటు’ అనే సామెత పుట్టింది. బాగా వడి తిరిగిన కొమ్ములు గల బర్రెతో కొట్టంలోని ఇతర బర్రెలకు మెదులరాదు, ఇబ్బంది అవుతదని; అట్లనే అల్పెం చేసే అల్లుడు కూడా అంతేనని ఈ సామెత వాడుతారు. కొన్ని కుటుంబాలు సంసారం పొదుపుగ చెయ్యకుండా దుబారా ఖర్చులు చేస్తుంటే వాల్లను ‘ఆరిండ్ల సంసారం మూడిండ్లు చేస్తది’ అంటరు. ఇసొంటి వాల్లనే ‘ఇల్లుపీకి పందిరి వేసినట్టు’ అంటరు. ఏదైనా పని మొదలు పెడితే వెంటనే పూర్తికాదు. దానికి చాలా ప్రణాళికలు కావాలి. పని మొదలు కాంగనే ఏమైంది, అయిందా అనేవాల్లు కూడా వుంటరు. అప్పుడు వాల్లకు సమాధానంగా ‘ఇల్లు అలుకంగనే పండుగ కాదు’ అని చెప్పుతరు. ఎవరింటికన్నా వెళ్లంగనే ఇల్లు అలంకార ప్రాయంగ ఎక్కడి వస్తువులు అక్కన్నే కన్పిస్తయి. ఇలాంటప్పుడు ‘ఇల్లును చూసి ఇల్లాలి సంగతి చెప్పొచ్చు’ అంటరు. అంటే ఇల్లు మొత్తం ఇల్లాలే చూసుకుంటది అనే అర్ధంలో వాడుతరు. అట్లనే ఇదే క్రమంలో ‘ఇల్లు సంగతి వాకిలి చూస్తేనే తెలుస్తది’ అని మరో సామెత వాడుతరు. వాకిట్లకు వెళ్లగానే ముగ్గులు, పూల మొక్కలు కన్పిస్తే అబ్బో ఎంత బాగుందో అనుకుంటం. మరో సామెత వుంది… ‘ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’ అంటరు. ఇల్లు నిర్మాణం శ్రమ, వ్యయంతో కూడుకున్నది. అట్లనే పిల్లల పెండ్లి చేయడం కూడా అలాంటిదే. రెండింటి శ్రమ ఒకటేననే అర్ధంలో ఈ సామెత వాడుతరు.
– అన్నవరం దేవేందర్, 9440763479