చాలామంది మహిళలు 40 దాటాక బరువు పెరుగుతుంటారు. నలభై తర్వాత శరీరంలో జరిగే జీవక్రియ మార్పులతో పాటు, హార్మోన్ల సమతుల్యత వంటి కారణాలు వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. లైఫ్‌స్టైల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ ఓ కారణం అని నిపుణులు అంటున్నారు. నలభై దాటిన తర్వాత.. మహిళలు హెల్తీ వెయిట్ మెయింటేన్ చేయడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడే పద్దతులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం…
వ్యాయామం చేయండి: మహిళల్లో వయసు పెరిగే కొద్దీ.. కండర ద్రవ్యరాశి తగ్గుతూ వస్తుంది. దీని కారణంగా వారిలో జీవక్రియ తగ్గుతూ వస్తుంది. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి.. ఫిట్‌నెస్ రొటీన్‌లో రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ను చేర్చుకోవడం చాలా ముఖ్యం. వెయిట్ లిఫ్టింగ్.. కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. మీ శరీర బలాన్ని, ఎముక సాంద్రతను కూడా పెంచుతుంది.
కొవ్వుని కరిగించే పండ్లు: హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ శరీరంలో కొవ్వును కరిగించడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీ వర్కౌట్‌లను వివిధ ఫిట్‌నెస్ స్థాయిలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చవచ్చు.
ప్రశాంతంగా నిద్రపోండి: బరువు కంట్రోల్లో ఉంచడానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. నిద్రలేమి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇది క్యాలరీ రిచ్ ఫుడ్స్ కోరికలను పెంచుతుంది. దీంతో శరీర జీవక్రియ కూడా నెమ్మదిగా ఉంటుంది. శరీర జీవక్రియను మెరుగుపరచడానికి, బరువు కంట్రోల్లో ఉండటానికి ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం.
సమతుల్య ఆహారం తీసుకోండి: బరువు కంట్రోల్లో ఉండటానికి, శరీర జీవక్రియ సక్రమంగా జరగడానికి.. సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నలభై ఏండ్లు దాటిన తర్వాత మహిళలు.. సమతుల్య, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. మీ డైట్‌లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, మినరల్స్‌తో కూడిన పోషకాహారం తీసుకోండి.
సరిపడా నీళ్లు తాగండి: శరీర బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. సరిపడా నీళ్లు తాగితే.. జీవక్రియను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. అతిగా తినకుండా నివారిస్తుంది. కేలరీ ఇన్‌టేక్‌ను తగ్గిస్తుంది.