ప్రశ్నిస్తే పోలీసుల అక్రమ కేసులా?

– యాదాద్రి జిల్లా అధ్యక్షులు అనిల్‌ను జైలుకు పంపడం తగదు
– అక్రమ కేసులను ఎత్తేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. ఎస్‌ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బుర్ర అనిల్‌పై అక్రమ కేసులు నమోదు చేసి జైల్‌కి పంపించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామంలో ఈనెల 20న డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బస్సు బోల్తా పడి ఇద్దరు మరణించారని తెలిపారు. మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రోడ్డుపై ధర్నా నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బుర్ర అనిల్‌ను అక్రమంగా అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌ చేసి జైలుకు పంపించారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని అడిగితే పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడతున్నారని విమర్శించారు ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేసే ఉద్యమకారులని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, అధికార దాహంతో ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుందనీ, వారిని ఇష్టారాజ్యంగా ఇబ్బందులకు గురి చేస్తే కాలమే వారికి సమాధానం చెప్తుందని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసి జైల్‌కి పంపిన అనిల్‌ను విడుదల చేయాలనీ, ఆయన మీద నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.