ఫోనే ప్రపంచమైతే…

If the phone is the world...నేటి డిజిటల్‌ యుగంలో సోషల్‌ మీడియా మన జీవితాల్లో ఓ ప్రధాన భాగంగా మారింది. క్షణాల్లో సమాచారం తెలుసుకోవడంతో పాటు వినోదం కోసం ఎక్కువ మంది చూస్తూ వుంటారు. అయితే దీనికి పరిమితులు వుండాలి. కానీ చాలా మంది సోషల్‌ మీడియాకు బానిసలుగా మారిపోయారు. ఈ వ్యసనం నుండి బయటపడేందుకు ఈ మధ్యకాలంలో రిహాబిటేషన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా బతికేస్తున్నారు. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ప్రాణమున్న మనుషులను పక్కన పెట్టి ప్రాణంలేని ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. దీని వల్ల కుటుంబాలు కూడా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. అలా సోషల్‌ మీడియా బాధితుల కథే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
స్నేహకు 25 ఏండ్లు ఉంటాయి. వినోద్‌తో పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు. వీరు మాత్రం ఉద్యోగ రీత్యా సిటీలో ఉంటున్నారు. ఇంకా పిల్లలు లేరు. పిల్లల కోసం అత్తమామల నుండి ఒత్తిడి ఉంది. కానీ వినోద్‌ మాత్రం వీటి గురించి అస్సలు పట్టించుకోడు. అతనికి స్నేహితులు కూడా పెద్దగా లేరు. బంధువులతో కూడా కలవడు. ఎవరైనా ఇంటికి వచ్చినా హారు, హలో చెప్పి వెళ్లిపోతాడు. ఏ విషయంపై శ్రద్ధ ఉండదు. ఆఫీసుకు వెళ్ళని రోజు భార్యాభర్త ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, కలిసి బయటకు వెళ్లడం లాంటివి కూడా చేయడు. కనీసం ఇంట్లో వున్నప్పుడైనా స్నేహతో కలిసి కలిసి టీవీ కూడా చూడడు.
వినోద్‌ ఒక్కడే కూర్చొని ఎప్పుడూ ఫోన్‌ చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఫోన్‌ చూస్తూ తనలో తనే నవ్వుకుంటాడు. ఏదైనా సమాచారం కావాలంటే వెంటనే ఫోన్‌ చూస్తాడు. ఇంటికి దగ్గరలో వుండే షాపుకు వెళ్ళి సరుకులు కూడా తీసుకురాడు. ఏదైనా చెబితే ‘ఫోన్‌ వుంది కదా అన్నీ అందులో ఆర్డర్‌ చేస్తే సరిపోతుంది’ అంటాడు. చివరకు పాల ప్యాకెట్‌ కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తాడు. ఇంటికి ఎవరైనా వచ్చినా ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేస్తాడు. అవి వచ్చే సరికి ఇంటికి వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు. స్నేహకేమో కనీసం ఇంటికి వచ్చిన వాళ్లకు టీ కూడా ఇవ్వలేకపోయామే అనే బాధ. దాంతో కొన్ని సార్లు అతనికి చెప్పకుండా తనే తెచ్చుకునేది.
ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడమే లేదు. అర్థరాత్రి వరకు వినోద్‌ ఫోన్‌ చూస్తూనే ఉంటాడు. ఇంత సేపు ఫోన్‌ ఎందుకు చూడడం అంటే ‘నాకు ఫోన్‌ చూడటమంటే ఇష్టం కాబట్టి చూస్తున్నాను. నిన్నేమీ చూడమని బలవంతం చేయడం లేదు కదా! నువ్వు నన్ను పట్టించుకోకుండా పడుకున్నా ఎప్పుడూ నిన్ను నేను ఏమీ అనలేదు. నీ ఇష్టం నీది. నా ఇష్టం నాది. అని వదిలేశాను. అయినా నువ్వెందుకు ఫోన్‌ విషయంలో ఎప్పుడూ నాతో గొడవ పడాలని చూస్తావు’ అంటాడు. కనీసం స్నేహకు ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడు. భార్యతో ఎలా ఉండలో తెలీదు. ఫోన్‌ మాత్రం ఎంతసేపైనా చూస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఫోన్లో నెట్‌ పని చేయకపోతే అల్లాడిపోతాడు. అదే భార్యకు ఆరోగ్యం బాగోకపోతే మాత్రం చీమకుట్టినట్టు కూడా ఉండదు ఆ మనిషికి.
‘నాకన్నా, వాళ్ల అమ్మా నాన్నల కన్నా అతనికి ఫోన్‌ అంటేనే ఇష్టం. ఫోన్‌ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు. ఇంట్లో ఉన్నా నాతో సంబంధం లేనట్టే ఉంటాడు. ఎప్పుడైనా ఆయనకు నచ్చితే దగ్గరకు వస్తాడు లేదంటే లేదు. తనకి ఫోన్‌ అంటే ఇష్టం కాబట్టి కనీసం ఇద్దరం ఫోన్లో అయినా మాట్లాడుకోవచ్చు కదా అని ఎప్పుడైనా ఫోన్‌ చేసే కట్‌ చేస్తాడు. చాటింగ్‌ చేసినా రిప్లరు ఇవ్వడు. ఇలాంటి వ్యక్తితో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
స్నేహ చెప్పింది మొత్తం విని వెంటనే వినోద్‌కు ఫోన్‌ చేసి పిలిపించాము. స్నేహ పడుతున్న బాధ గురించి అడిగితే ‘నేను ఎప్పుడూ ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ఆ ఉద్దేశం కూడా నాకు లేదు. స్నేహ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను నేను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. ఆమెకు నచ్చినట్టు ఉండమనే చెప్తాను. ఇంట్లోకి ఏం కావాలన్నా వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తాను. ఇద్దరం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసి ఇంటికి వస్తాము. ఆమె పని చేసుకొని తిని పడుకుంటుంది. అయినా నేను ఎప్పుడూ ‘నన్ను వదిలిపెట్టి నువ్వెందుకు పడుకుంటున్నావు’ అని అడగను. పాపం అలసిపోయి వస్తుంది కదా అని పెద్దగా పట్టించుకోను.
ఇక నేను ఫోన్‌ ఎక్కువగా చూస్తానంటే నా వర్క్‌ మొత్తం ఫోన్‌లోనే ఉంటుంది. ఆఫీసులో అయితే కంప్యూటర్‌ వుంటుంది. ఇంట్లో ఉండదు కాబట్టి ఫోన్‌లో పని చేయక తప్పదు. ఆమె ఎప్పుడైనా మెసేజ్‌ పెడితే రిప్లరు ఇవ్వడానికి కూడా టైం వుండదు. అంత బిజీగా ఉంటాను. సోషల్‌ మీడియా కూడా ఎక్కువగానే చూస్తుంటాను. మాది పల్లెటూరు. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు అంతగా తెలియదు. ఏది మాట్లాడితే ఎవరు ఏం అనుకుంటారో అని ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. స్నేహ కూడా నేను ఏదైనా తప్పు మాట్లాడితే నాకు దూరం అవుతుందేమో అని భయం. నా స్నేహితుడిని తన భార్య అలాగే వదిలేసింది. స్నేహ కూడా అలాగే వెళ్లిపోతుందేమోనని జాగ్రత్తగా, ఎంత అవసరమైతే అంతే మాట్లాడతాను. కాని ఇప్పుడు అదే నాకు పెద్ద సమస్యగా మారింది. నేను తనకు సమయం ఇవ్వడం లేదని బాధపడుతుంది. కాబట్టి ఇకపై నా పద్దతి మార్చుకుంటాను. నాకు కొంత సమయం ఇవ్వండి. ప్రయత్నం చేస్తాను’ అన్నాడు.
దానికి మేము ‘ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే వారి మధ్య కమ్యూనికేషన్‌ చాలా అవసరం. మాట్లాడుకుంటేనే కదా ఒకరి గురించి ఒకరికి తెలిసేది. మీ మధ్య ప్రేమ పెరగాలి అంటే మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు సమయం కేటాయించుకోవాలి. ఫోన్‌ చూడడం కాస్త తగ్గించి స్నేహతో మాట్లాడండి. ఆమెను అర్థం చేసుకోండి. ఫోన్‌ చూడడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరగడం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. మీ సమస్య ఏంటో మీరు అర్థం చేసుకున్నారు, మారతానని చెప్పారు అది ఆచరణలో చూపించండి. అప్పుడే స్నేహతో పాటు మీరూ సంతోషంగా ఉండొచ్చు’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి, 9948794051